పాలకుర్తి, డిసెంబర్ 31 : పాల్కురికి సోమనాథుడి తత్వం, సామాజిక సేవ తరతరాలకు ఆదర్శమని, మహాకవి జన్మించిన ఈ నేలను సందర్శిస్తే తనువు పులకరిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు అన్నారు. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరిట ఏర్పాటుచేసిన సోమనాథ కళాపీఠం సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం పాలకుర్తిలో సాహితీరంగంలో సేవలందిస్తున్న రచయితలు, కవులకు 2021-22 వార్షిక పురస్కారాలు అందించారు. కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ సోమనాథుడి సాహిత్యం అందరికీ ప్రేరణగా నిలిచిందన్నారు. సోమనాథుడి కావ్యాలు, సాహితీరంగానికి అందించిన సేవ లు మార్గదర్శకమని కొనియాడారు. మూడు దశాబ్దాలుగా సోమనాథ కళాపీఠం సాహితీవేత్తలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. మహాకవులు సోమనాథుడు, బమ్మెర పోతన నడయాడిన నేలలో పురస్కారాలు అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఎనిమిది శతాబ్దాల క్రితం ప్రభవించిన సాహితీ విప్లవమూర్తి సోమనాథుడు అని తెలిపారు. తెలుగు, కన్నడ, మరాఠ, బసవ భక్తులకు ప్రశస్త దర్శనీయ క్షేత్రం, ఆదర్శభావాలను వెదజల్లిన నేల పాలకుర్తి అన్నారు.
సాహితీరంగంలో సేవలందిస్తున్న వారికి సోమనాథ కళాపీఠం పురస్కారాలను ప్రదానం చేసింది. సోమనాథ సాహిత్య పురస్కారాన్ని కానుకుర్తిశెట్టి సోమశేఖర్‌కు, సోమనాథ సామాజిక శోధన పురస్కారాన్ని నలిమెల భాస్కర్‌కు, సోమనాథ రంగస్థల పురస్కారాన్ని మంచాల రమేశ్‌కు అందజేశారు. పందిళ్ల శేఖర్‌బాబు రాజయ్యశాస్త్రి స్వచ్ఛంద భాషా సేవ పురస్కారాన్ని మైథిలి అబ్బరాజుకు, వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారాన్ని ఎంఎస్ఆర్ వెంకటరమణకు, ముశం దామోదర్‌రావు ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధనా పురస్కారాన్ని సీఎస్ఆర్ ప్రభుకు, రాపో లు సోమయ్య ప్రతిభా పురస్కారాన్ని అరూరి మహేందర్‌కు, దేవగిరి రాజయ్య స్మారక బిరుదును బూస రేణుకారాధ్యకు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్, ప్రొఫెసర్ అవుటి జగదీశ్, సర్పం చ్ వీరమనేని యాకాంతరావు, పాలకుర్తి దేవస్థాన ధర్మకర్త కోడూరు నర్సింహారెడి,్డ ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, జర్నలిస్టు మార్గం లక్ష్మీనారాయణ, ఇమ్మడి దామోదర్, జక్కుల రవీందర్, వీరమనేని వేంకటేశ్వర్రావు, రాపాక విజయ్, గుమ్మడిరాజుల సాంబయ్య, యువ రచయిత కవి గూడూరు లెనిన్, కూరపాటి సుదర్శన్ పాల్గొన్నారు. పొట్లపల్లి సాయిసింధు ప్రదర్శించిన నృత్యం సభికులను అలరించింది. అనంతరం కవులు, రచయితలు పాల్కురికి సోమనాథుడి స్మృతివనంలోని సోమనాథుడి విగ్రహాన్ని, సహజ కవి పోతన జన్మస్థలమైన బమ్మెరలోని పోతన మందిరాన్ని సందర్శించారు.