దుగ్గొండి,ఏప్రిల్,10 : వేసవి సెలవుల్లో విద్యార్థులు బావులు, చెరువుల వద్దకు తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లకూడదని ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండాలన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వీడియో గేములకు దూరంగా ఉండాలన్నారు.
ఎలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ రామస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.