వరంగల్, అక్టోబర్ 13 : భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవం కనులపండువగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం విజయదశమిని పురస్కరించుకుని భద్రకాళీ చెరువులో విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన హంసవాహనంపై అమ్మవారు ఊరేగారు. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, తెప్పోత్సవం శాశ్వత దాత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు.
తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలిరాగా, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆదివారం సాయంత్రం భద్రకాళీ-భద్రేశ్వరుల కల్యాణం ఆలయ ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. అమ్మవారిని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి దర్శించుకున్నారు. కల్యాణోత్సవంతో ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం అయినట్లు ఈవో శేషుభారతి తెలిపారు.