గ్రామాల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ (సూక్ష్మ వడ్డీ వ్యాపారం) పడగవిప్పుతున్నది. పదేళ్ల క్రితం పేద కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన సంస్థలు తమ కార్యకలాపాలు తాజాగా మొదలుపెట్టాయి. పేద ప్రజల అవసరాలే ఆసరాగా అధిక వడ్డీలకు రుణాలిచ్చి వారి నడ్డి విరుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలాది కుటుంబాలు కిస్తీలు చెల్లించలేక సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులు తీవ్రమవుతున్నాయి. దీంతో అప్పులు కట్టలేక.. రోజు రోజుకూ పెరుగుతున్న వారి ఆగడాలను తట్టుకోలేక పలువురు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
– సుబేదారి, జనవరి 4
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హ నుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మ హబూబాబాద్, జనగామ జిల్లాల్లో టాటా, ఐఐఎఫ్ఎల్, బంధన్, ఫిన్‌కేర్, ఆర్మన్, ఆధార్‌తోపాటు అనేక మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేద, సామాన్య ప్రజల ఆర్థిక అవసరాలను టార్గెట్‌గా చేసుకుంటున్నాయి. గృహ నిర్మాణాలు, పిల్లల చదువు, పంట పెట్టుబడి, ఉపాధి రంగాల పేరుతో అధిక వడ్డీకి రుణాలిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని సంస్థలు వ్యక్తిగతంగా, మరి కొన్ని గ్రూప్‌ల పేరుతో ఎక్కువగా మహిళలను లక్ష్యంగా చేసుకొని నెల, వారం కిస్తీలుగా రూ. 10 లక్షల వరకు లోన్లు ఇస్తున్నారు. రెండు, మూడు కిస్తీలు కట్టకుంటే ఇళ్ల ముందుకు వచ్చి బూతులు తిడుతూ ‘చస్తే చావండి.. మాకు మాత్రం డబ్బులు కట్టండి’ అంటూ రెచ్చిపోతున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు చిన్న తరహా రుణాలివ్వకపోవడం, లోను కోసం ఆస్తుల గ్యారెంటీ, ష్యూరిటీల నిబంధనలు పెట్టడంతో పేద ప్రజలు తక్షణావసరాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థలు రూ. 10 వేల నుంచి రూ. 10 లక్షలు ఆపైన రుణాలిస్తూ 10 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. రుణాలను బట్టి కిస్తీలు కట్టేందుకు వారం, పదిహేను, నెల రోజుల వ్యవధి ఇస్తూ వడ్డీతో స హా కట్టించుకుంటున్నాయి. ఇలా రూ. 20 వేలు తీసుకుంటే మూడు నెలల్లో రూ. 25 వేలు చెల్లించాల్సి వస్తుం ది. ఒకవేళ రెండు, మూడు కిస్తీలు చెల్లించని పక్షంలో సి బ్బంది ఇళ్లపైకి రావడం, బెదిరింపులకు పాల్పడడం, డ బ్బులు కట్టే వరకు కదిలేది లేదంటూ తీవ్రంగా వేధిస్తున్నారు. వీటిని తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఊరు మారినా అక్కడికి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల ఒత్తిడితో ఉమ్మడి వరంగల్ జి ల్లాలో నెల రోజువ వ్యవధిలోనే నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు దంపతులున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కమలాపూర్ గ్రామ పరిధి మంజినాయక్ తండాకు చెందిన భార్యాభర్తలు పలు మైక్రో సంస్థల నుంచి రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్నారు. వారానికి రూ. 200 చొప్పున చెల్లించాల్సి ఉం డగా, కుటుంబ సభ్యుల అనారోగ్యంతో వాటిని కట్టలేకపోయారు. దీంతో ఆయా సంస్థల సిబ్బంది ఇంటికి వచ్చి వేధించడంతో పాటు తోటి గ్రూప్ సభ్యులు కూడా ఒత్తిడి చేయడంతో డిసెంబర్ 6న బానోత్ చందన (32) పురుగుల మందు తాగగా చికిత్స కోసం ఎంజీఎంలో చేర్పించారు. భార్య పరిస్థితిని చూసి భర్త దేవేందర్ (37) గత నెల 20న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చే సుకున్నాడు. నాలుగు రోజుల క్రితం చందన చికిత్స పొందుతూ మృతి చెందగా ఇద్దరు కుమారులు అనాథలయ్యారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన అంగడి ఎలేంద్ర (35) గృహ నిర్మాణం కోసం ఆధార్హౌస్ మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి రూ. 15 లక్షల అప్పు తీసుకుంది. రెగ్యులర్‌గా కిస్తీలు చెల్లించినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో మరికొన్ని కట్టలేకపోయింది. దీంతో ఆ సంస్థ నోటీసులు ఇవ్వడంతో పాటు ఇంటికి వచ్చి వేధించడంతో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తిలోని తల్లిగారింటికి వచ్చి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన ఆకునూరి రాకేశ్ (30) ఆర్మాన్ మైక్రోఫైనాన్స్ నుంచి రూ. 75 వేలు రుణం తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో నాలుగు నెలల కిస్తీలు చెల్లించకపోవడంతో సంస్థ సిబ్బంది ఇంటికి వచ్చి వేధించడంతో తట్టుకోలేని రాకేశ్ కుంటుంబంతో అన్న నివాసం ఉంటున్న అదే మండలంలోని గూడూరుకు వెళ్లాడు. అక్కడికి కూడా వచ్చి ఫైనాన్స్ సిబ్బంది వేధించడంతో రాకేశ్ డిసెంబర్ 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఇంత జరుగుతునా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2011వరకు మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల ప్రజలకు అధిక వడ్డీకి రుణాలిచ్చి వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల పోరాటంతో అప్పటి రోశయ్య ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ రెగ్యులేటర్ యాక్ట్ తీసుకొచ్చి నియంత్రించింది. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పేదలకు అధిక వడ్డీకి రుణాలిస్తూ ఆర్థిక భారం మోపుతున్నాయి. కిస్తీలు కట్టలేక, వేధింపులు భరించలేక ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌లో నలుగురు చనిపోగా అనేక చోట్ల పలువురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మైక్రోఫైనాన్స్ సంస్థలను నియంత్రించేందుకు రెగ్యులేటర్ యాక్ట్ తీసుకొచ్చి పటిష్టంగా అమలు చేయాలి. పేద ప్రజలు ఆత్మహత్య చేసుకోకుండా చూడాలి. లేదంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం.
– కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్