మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 14 : గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని గిరిజన సంఘాల నాయకులతో కలిసి సంబురంగా నిర్వహించామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం సమీపంలో సేవాలాల్ గుడి వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వా త అసమర్థ పాలనను కొనసాగిస్తున్నదని అన్నారు. అనంతారం గుడి పక్కన తనకు సొంతస్థలం ఉందని, అందులో ఇల్లు నిర్మించుకొని ఉంటున్నానని తెలిపా రు.
తమ ఇంట్లో తాముంటే పోలీసులు అత్యుత్సాహంతో ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నట్లు చెప్పారు. తనను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నా రు. గతంలో ఎప్పుడూ ఇంతమంది పోలీసులతో సేవాలాల్ జయంతిని చేయలేదని, ఇప్పుడు జిల్లాలో ని పోలీసులందరూ మోహరించారని పేర్కొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే మురళీనాయక్ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి పంపారని, గుడి పక్కన ఉన్న ఇంట్లో తాళం పగులగొట్టి వస్తువులను ధ్వంసం చేశారని, దాంతోనే వివాదం వచ్చినట్లు తెలిపారు. సేవాలాల్ గుడి పక్కన అంతా పట్టా భూమి అని, హైకోర్టు సైతం భూమి తనదేనని స్టే ఆర్డర్ కూడా ఇచ్చినా ఎమ్మెల్యే మురళీనాయక్ కావాలనే పార్టీ నాయకులతో ఘర్షణ చేస్తూ పోలీస్ ఫోర్స్‌ను పెట్టించారన్నారు.
పోలీసులు సైతం గూండాగిరి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తూ అన్ని ఆధారాలు ఉన్న మమ్మల్ని లోపలకు పోకుండా గేటు ముందే ఉంచారని, పోలీసులు చేస్తు న్న ఓవరాక్షన్‌ను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ సీఐ దేవేందర్, రూరల్ సీఐ సర్వయ్య, రవి కుమార్, ఎస్సైలు, దీపిక, శివ కుమార్, తిరుపతి, వెంకన్న, మురళీధర్, సతీశ్, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాగా, అంతకుముందు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్న గుడి స్థలం వద్ద వివాదం చోటుచేసుకున్నది. బోగ్ భండారో నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి అనంతారం వద్ద ఉన్న సేవాలాల్ గుడి వద్దకు వచ్చారు. భారీ బందోబస్తుతో ఉన్న పోలీసులు శంకర్‌నాయక్‌ను లోపలకు పంపకుండా గేటు వద్దనే ఉంచారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి సర్ది చెప్పి పంపించారు.