వరంగల్ లీగల్, ఆగస్టు 28: రెండో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం సంచలన తీర్పు ప్రకటించింది. ఈ చట్టం కింద బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షలను పరిహారంగా అందజేయాలని పేర్కొని దేశంలో అత్యధిక పరిహారాన్ని ప్రకటించిన న్యాయమూర్తిగా మనీషాశ్రావణ్ నిలిచారు.
వివరాలిలా ఉన్నాయి.. రామన్నపేట పరిసరాల్లో నివసించే బాలిక కుటుంబ సభ్యులు ప్రతి ఆదివారం ప్రార్థన కోసం చర్చికి వెళ్తుంటారు. 2019 సంవత్సరం ఫిబ్రవరి 5న ప్రార్థన కోసం వెళ్లిన తమ ఏడేళ్ల పాప ఇంటికి రాకపోవడంతో హైరానాపడ్డ కుటుంబసభ్యులు వెతుకుతుండగా తారసపడింది. తనను ఓ వ్యక్తి చాక్లెట్ కొనిస్తానని మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్లి మార్గమధ్యంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఏసీపీ చంద్రయ్య పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సరైన ఆధారాలతో నిందితుడు రామరూపుల ప్రభుచరణ్‌ను అదుపులో తీసుకొని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు.
విచారణ అనంతరం నేరం రుజువైందని భావించిన న్యాయస్థానం ప్రభుచరణ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోకీల సత్యనారాయణ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పోక్సో చట్టం కింద బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, స్థానిక న్యాయ సేవా సంస్థ బాధితులకు ఈ పరిహారాన్ని బట్వాడా చేయించాలని తీర్పులో పేరొంది.
ఈ కేసులో పొక్సో కోర్టు న్యాయమూర్తి దేశ చరిత్రలోనే అత్యధిక పరిహారాన్ని ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బాధిత కుటుంబం ఈ ఘటన తర్వాత ఎదురొనే సామాజిక వివక్షతను, వారి పేదరికాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకురావడంతో ప్రత్యేక నిధి నుంచి ప్రభుత్వం బాలిక కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు పోక్సో చట్టం కింద రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తుండగా, రూ. 10 లక్షలు ప్రకటించి వరంగల్ పోక్సో ప్రత్యేక కోర్టు ఆదర్శంగా నిలిచింది.
– మోకీల సత్యనారాయణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్