హనుమకొండ చౌరస్తా : ఆత్మరక్షణ (Self-defense) శిక్షణ ప్రతి విద్యార్థికి అవసరమని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి (MLA Nayini Rajender Reddy) అన్నారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం( జేఎన్ఎస్) ఇండోర్ స్టేడియంలో బాలికల స్వీయ రక్షణకై యూఎస్ఏలో (USA )లో స్థిరపడ్డ గ్రాండ్ మాస్టర్ గూడూరు సుధాకర్ నేతృత్వంలో ఆత్మరక్షణ మెలుకువలు (సెల్ఫ్ డిఫెన్స్) శిక్షణ శిబిరాన్ని కలెక్టర్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలపై పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వారి భద్రతను నిర్ధారించడానికి పాఠశాలల్లో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలని సూచించారు. బాలికలకు ఆత్మరక్షణ, ఆరోగ్యం, ఫిట్నెస్, ఆత్మబలాభివృద్ధిని నేర్పించడం ద్వారా వారికి సాధికారత కల్పించినట్టు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి గుగులోత్ అశోక్ కుమార్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిన్నీ లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట పవన్, తదితరులు పాల్గొన్నారు.