వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 12 : వరంగల్లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తున్నది. స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది మంది మహిళలకు ఉచిత సేవలందిస్తున్న ఈ ఆస్పత్రిపై ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది.
గర్భస్థ శిశువు ఎదుగుదల, ఆరోగ్య స్థితిని తెలుసుకోవడంతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో చేసే స్కానింగ్లను నిర్వహించేందుకు సిబ్బంది కరువయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సర్కారు వైద్యాన్ని మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఆధునిక యంత్ర పరికరాలు, వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో సీకేఎం ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఇటీవల ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు రేడియాలజిస్టులు బదిలీ కాగా, ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం పీజీ డాక్టర్ మాత్రమే నామమాత్రంగా సాధారణ స్కానింగ్లు చేస్తున్నారు. వైద్యుల సూచనల మేరకు భారమైనా ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించక తప్పడం లేదని గర్భిణులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేడియాలస్టులతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని మహిళలు కోరుతున్నారు.