బచ్చన్నపేట ఏప్రిల్ 23 : గ్రామపంచాయతీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘటితంగా పోరాట చేద్దామని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ అన్నారు. బుధవారం ఆయన బచ్చన్నపేట గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల సాధనకు ఉద్యోగులు, కార్మికులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా మల్టీపర్పస్ విధానంతో అన్ని కేటగిరీలో ఉద్యోగులు నానా ఇబ్బంది ఎదుర్కొంటు న్నారన్నారు. చాలీచాలని వేతనాలతో గ్రామపంచాయతీలో ఎన్నో ఏళ్లుగా పెట్టి చాకలి చేస్తున్న వారికి సరైన గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో 51 రద్దు అయితేనే గ్రామాల్లో ఎవరి పనులు వారు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఉద్యోగులు ఏకతాటి పైకి వస్తేనే సమస్యలు సులభతరంగా పరిష్కారం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, ప్రచార కార్యదర్శి కాళ్ళ ప్రభాకర్, రాష్ట్ర ఆర్గనైజర్ కొమురెల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి బాబు గౌడ్, మండల అధ్యక్షులు టేకులపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, మండల కోశాధికారి నాగయ్య, సంఘం నాయకులు దయాకర్, కిష్టయ్య, దేవయ్య. అశోకు, శీను, రాజు, శివ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.