కాజీపేట, సెప్టెంబర్ 13 : కాజీపేట దర్గా ఉర్సు షురువైంది. పీఠాధిపతి ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో జరిగే సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుండడంతో దర్గా పరిసర ప్రాంతాలన్నీ బుధవారం సాయంత్రం నుంచే కిక్కిరిసిపోయాయి. బుధవారం రాత్రి సందల్ వేడుక ఘనంగా కొనసాగింది. కాగా భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. మరోవైపు పోలీసు శాఖ గట్టి బందోబస్తు కల్పించింది. ఉత్సవాల్లో ఏర్పాటైన వివిధ దుకాణాలు, చిల్డ్రన్ ఎగ్జిబిషన్ వద్ద సందడి నెలకొంది. ఉచిత వైద్య శిబిరం, పోలీస్ హెల్ప్‌లైన్ కేంద్రం సేవలందిస్తున్నాయి.
పరిసర ప్రాంతాల్లో దాదాపు 30కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఖుస్రూపాషా తెలిపారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ నేతృత్వంలో స్థానిక ఇన్స్పెక్టర్ సార్ల రాజు ఆధ్వర్యంలో సిబ్బంది భద్రత కల్పిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూస్తున్నారు. సబ్ డివిజన్ పరిధితో పాటు జిల్లా నుంచి దాదాపు 300 మంది కానిస్టేబుళ్లు, 20 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఐదుగురు సీఐలు విధి నిర్వహణలో ఉన్నారు. రైల్వేగేట్ వద్ద రక్షణ కోసం రైల్వే ఆర్పీఎఫ్, జీఆర్పీ, ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. హనుమకొండ డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు వైద్యాధికారులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నా రు. మూడు రోజుల పాటు భక్తులకు సేవలందిస్తారు. దర్గా సమీపంలోని కడిపికొండ, బోడగుట్ట, సోమిడి వైద్యాధికారుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
భక్తిశ్రద్ధలతో సందల్
దర్గా ఉత్సవాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి సందల్ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. సందల్ ఊరేగింపు అర్ధరాత్రి వరకు దర్గా పురవీధుల్లో కన్నుల పండువగా కొనసాగింది. దర్గా కాజీపేట జాగీర్‌లోని (బడేఘర్)లో సంప్రదాయం ప్రకారం బియాబానీ కుటుంబానికి చెందిన మహిళలు, ముస్లిం పెద్దలు, అత్యంత భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి తీసిన గంధాన్ని వెండి గిన్నెలో భద్రపరిచారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో పలు దర్గాల పీఠాధిపతులు బడేఘర్లో ప్రత్యేక ప్రార్థన చేశారు. పీఠాధిపతి ఖుస్రూపాషా గంధంతో ఉన్న వెండి గిన్నెను తలపై పెట్టుకుని దర్గాకు తీసుకెళ్తుండగా గిన్నెను తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు.
రాత్రి 11 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు అర్ధరాత్రి 1గంట దాకా సాగింది. డప్పుచప్పుళ్లు, ఫకీర్ల విన్యాసాలు, ఖవ్వాలీ, భజన కీర్తనలు, యువకుల నృత్యాలు, కేరింతల మధ్య దర్గా ప్రాంతమంతా మార్మోగింది. అర్ధరాత్రి తర్వాత దర్గాకు చేరుకున్న పీఠాధిపతి ఖుస్రూపాషా దర్గాలోని సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ సమాధికి గంధలేపనం చేసి ఫూల్ చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా ప్రకటించారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, మత పెద్దలు, సూఫీలు, భక్తులు ఖవ్వాలిలో పాల్గొన్నారు. సందల్ ఊరేగింపులో డీసీపీ బారీ నేత్వత్వంలో కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సార్ల రాజు బందోబస్తు నిర్వహించారు.