సుబేదారి, ఏప్రిల్ 8 : ‘అరేయ్.. రేపటి నుంచి నువ్వు సీట్లో కూర్చోవద్దు.. లీవ్ పెట్టి వెళ్ళిపో.. నా వాళ్లకే పనిచేయ వా?’ అంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ ఇన్స్పెక్టర్ ను పరుష పదజాలంతో దూషించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ పోలీసు కమిషనరేట్ ఈస్ట్ జోన్ పరిధిలోని ఓ పట్టణంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ను భూ వివాదం విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు బూతులు తిట్టినట్లు తెలిసింది.
‘నా వాళ్లకు అనుకూలంగా పనిచేయకుం డా ప్రత్యర్ధి వర్గానికి కొమ్ముకాస్తావా? రెండు వర్గాల నుంచి డబ్బులు తీసుకుంటావా? నాకు బాగా పనిచేస్తావని నమ్మి పోస్టింగ్ ఇప్పిస్తే నా మాటనే బేఖాతర్ చేస్తావా? రేపటి నుంచి సీట్లో కూర్చోవద్దు’ అని తిడుతూ హుకుం జారీ చేశాడు. దీంతో సదరు ఇన్స్పెక్టర్ వారం రోజులు సెలవులో వెళ్లి తిరిగి కొద్ది రోజుల క్రితం డ్యూటీలో చేరాడు. బదిలీ కోసం ఆయన కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రిని కలిసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఆ ఎమ్మెల్యే ప్రధాన అనుచురుడు సైతం ఒకే సామాజిక వర్గం అని పోస్టింగ్ ఇప్పిస్తే మా మాటే వినడం లేదంటూ సదరు ఇన్స్పెక్టర్పై మండిపడినట్లు తెలిసింది. ప్రస్తుతం నామ్కే వాస్తేగా స్టేషన్కు వస్తున్న ఇన్స్పెక్టర్ వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.