వరంగల్, డిసెంబర్ 25 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పాలన వ్యవహారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువైంది. ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలనే విషయాన్ని కూడా వారే నిర్ణయిస్తున్నారు. ఈ క్రమంలోనే బల్దియాలో చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ (సీహెచ్‌వో) పోస్టు భర్తీ రగడ రాజుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే తాను సిఫారసు చేసిన ఉద్యోగికే పోస్టింగ్ ఇవ్వాలని తీవ్ర స్థాయిలో కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వ్యవసాయ శాఖ నుంచి ఓ మండల అధికారి బల్దియాలో ఏడాది కాలం పాటు విధులు నిర్వర్తించేందుకు రెండు రోజుల క్రితం డిప్యుటేషన్‌పై వచ్చారు. ఆయన అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సిఫారసుతో వచ్చినట్లు సమాచారం. అతడికే సీహెచ్‌వో పోస్టు ఇవ్వాలని సదరు ఎమ్మెల్యే కమిషనర్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు బల్దియాలో చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అటవీ శాఖ నుంచి ఓ అధికారి ఇప్పటికే డిప్యుటేషన్‌పై వచ్చి హార్టికల్చర్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారిది హెచ్వోగా విధులు నిర్వర్తిస్తున్న అధికారి కంటే చిన్న ర్యాంక్. అయితే ఎమ్మెల్యే దీనిని పట్టించుకోకుండా తాను సిఫారసు చేసిన ఉద్యోగికి సీహెచ్‌వో పోస్ట్ ఇవ్వాలని పట్టుపడుతుండడంతో కమిషనర్ ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు సమాచారం.
వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఇద్దరు అధికారుల హోదాలు తేల్చాలని కమిషనర్ బల్దియా అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం హెచ్వోగా విధులు నిర్వర్తిస్తున్న రమేశ్ అటవీ శాఖలో డివిజనల్ రేంజ్ అధికారిగా పనిచేస్తూ బల్దియాకు డిప్యుటేషన్‌పై వచ్చారు. వ్యవసాయ శాఖలో మండల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మారెడ్డి ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వచ్చారు. వీరిలో ఎవరి హోదా ఎక్కువైతే వారికే సీహెచ్‌వో బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. వీటిని పట్టించుకోని సదరు ఎమ్మెల్యే తన సిఫారసుతో డిప్యుటేషన్ పై వచ్చిన ఉద్యోగికి సీహెచ్‌వో పోస్టు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో కమిషనర్ ఇద్దరి ఉద్యోగుల ర్యాంక్, సీనియారిటీని పరిశీలించాలని ఆదేశించినట్లు సమాచారం.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పాలనలో అధికార పార్టీ నేతల జోక్యం ఎక్కువవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి ఇంటి పర్మిషన్లు, ఇతర పనులన్నీ వారే దగ్గరుండి చేయిస్తున్నారు. దీంతో బల్దియా పాలన గాడి తప్పింది. తాము స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితి లేదని స్వయంగా అధికారులే చెబుతున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లలో సైతం వారి జోక్యం పెరుగుతున్నట్లు సమాచారం. కింది స్థాయి ఉద్యోగులైతే అధికార పార్టీ నేతలతో వణికిపోతున్నారు.