కాశీబుగ్గ, ఏప్రిల్ 13 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా ఉన్న లక్ష్మీపురం పండ్ల మార్కెట్లో బుధవారం మెట్రిక్ టన్ను మామిడికి రికార్డు స్థాయిలో రూ. 80వేల ధర పలికింది. గత సంవత్సరం కంటే ఈసారి దిగుబడి తగ్గడం వల్లే రేటు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో మామిడి సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమైనట్లు వారు తెలిపారు. గత సంవత్సరం సీజన్ ప్రారంభంలో టన్నుకు రూ.20వేల నుంచి రూ.70వేల వరకు ధరలు పలికినట్లు వ్యాపారులు తెలిపారు.
ఈ సీజన్లో టన్నుకు రూ.40వేల నుంచి రూ.80వేల వరకు ధరలు పలుకుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం సరాసరి ప్రతి రోజు 185 మెట్రిక్ టన్నులు, సీజన్ మొత్తంలో 2019.5 మెట్రిక్ టన్నుల మామిడి వచ్చిందన్నారు. టన్నుకు రూ.15వేలు, రూ.25వేలు, గరిష్ఠంగా రూ.40వేలు ధరలు పలికాయి. కాగా, ఈ సీజన్లో ప్రతి రోజు సరాసరి 9.1 మెట్రిక్ టన్నులు, ఇప్పటివరకు 64.2 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు తెలిపారు. ధర కనిష్ఠంగా రూ.40వేలు మధ్య రకానికి రూ.56వేలు, గరిష్ఠంగా రూ.80వేలు పలుకుతున్నట్లు తెలిపారు. ఈసారి 30శాతం తక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని పండ్ల వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి, దొంగల చెన్నమల్లు యాదవ్ తెలిపారు.