సుబేదారి, నవంబర్ 1 : వరంగల్ నగరం క్రిమినల్స్‌కు అడ్డాగా మారుతున్నదా..?, రౌడీ షీటర్లకు షెల్టర్ జోన్ అవుతున్నదా..?, నేరస్తులు గన్ కల్చర్‌తో పేట్రేగిపోతున్నారా..? అంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నగరంలోని భీమారంలో ఓ అద్దె ఇంట్లో మకాం వేసి, కొందరు యువకులను చేరదీసి, గంజాయి తాగుతూ నాలుగు నెలలుగా యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా స్థానిక పోలీసులు గుర్తించలేకపోయారు. చివరకు ఓ లారీ డ్రైవర్‌కు తుపాకీ ఎక్కుపెట్టి డబ్బులు గుంజిన ఘటనతో వారి ఉనికి బయటపడింది. పోలీసులు అలర్ట్ అయి ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రెండు వెపన్స్ స్వాధీనం
చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ మీర్‌పేట్‌కు చెందిన మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ దాసరి సురేందర్ అలియాస్ సూరిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారులు పీడీయాక్ట్ నమోదు చేసి, సిటీయాక్ట్ ద్వారా కొద్ది నెలల క్రితం నగర బహిష్కరణ చేశారు. దీంతో అతడు వరంగల్ బాట పట్టి, ఇక్కడే మకాం ఏర్పాటు చేసుకున్నాడు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. సురేందర్ అలియాస్ సూరీ కరుడు కట్టిన నేరస్తుడు.
హైదరాబాద్‌లో అతడిపై సుపారీ హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దాడులకు పాల్పడిన కేసులు సుమారు 40 ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. హైదరాబాద్ పోలీసులు అతడిని నగర బహిహ్కరణ చేయడంతో కొద్ది నెలల క్రితం వరంగల్ నగరానికి మకాం మార్చాడు. హనుమకొండ భీమారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కొద్దిమందిని చేరదీసి నగర శివారులోని ఓ డాగ్ఫాంలో అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. నగరంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీటె క్ విద్యార్థి, ములుగు జిల్లాకు చెందిన మరో ఇద్దరు విద్యార్థు లు, నగరానికి చెందిన ఓ డాగ్ఫాం నిర్వాహకుడు ఇతడి ముఠాలో ఉన్నట్లు తెలిసింది. వీరంతా రాత్రి సమయంలో గంజాయి తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
ఈనెల 18న చింతగట్టు ఔటర్‌రింగ్ రోడ్డుపై నిర్జన ప్రదేశంలో రాత్రి సమయంలో ముఠాలో ఓ సభ్యుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అక్కడే మద్యం తాగి, గన్‌ఫైర్ చేసిన తర్వాత రెండు బైక్‌లపై నలుగురు ముఠా సభ్యులు మాందారిపేట గుట్టల్లో గంజాయి తాగారు. అక్కడి నుంచి హనుమకొండకు వస్తూ, శాయంపేట పోలీసు స్టేషన్ పరిధిలో వరంగల్-పరకాల హైవేపై మాందారిపేట పె ట్రోల్బంకు సమీపంలో లారీని ఓవర్‌టెక్ చేసి, లా రీ డ్రైవర్‌కు తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించి డబ్బులు గుంజుకున్నట్లు సమాచారం. డ్రైవర్ ఫిర్యాదుతో శాయంపేట పోలీసులు, వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి రెండు రోజుల క్రితం ముఠాను పట్టుకొని రెండు వెపన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో హైదరాబాద్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సూరి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు.
కాగా, హైదరాబాద్‌కు చెందిన ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకోవడంలో శాయంపేట, టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలిసింది. ముందే నేరస్తుడి చరిత్ర తెలుసుకొని రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అతడి వద్దకు వెళ్లారు. పోలీసుల రాకతో అలర్ట్ అయిన నేరస్తుడు తుపాకీ తీసేప్రయత్నం చేయగా, వెంటనే ఓ ఎస్సై సర్వీస్ రివ్వాలర్‌ను ఎక్కుపెట్టడంతో సిబ్బంది గట్టిగా అదిమిపట్టుకొని అరెస్ట్ చేసి వరంగల్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ముఠాను పోలీసు అధికారులు అరెస్ట్ చూపించే అవకాశం ఉన్నది. కాగా, హైదరాబాద్‌కు చెందిన కరుడు కట్టిన నేరస్తుడు వరంగల్ నగరంలోని భీమారంలో నాలుగు నెలలుగా అద్దె ఇంట్లో ఉంటున్నా ఇక్కడి పోలీసులు కనిపెట్టకపోవడం గమనార్హం. కాగా, ఈ ముఠా ఇతర జిల్లా లో హత్యచేయడానికి డీల్ కూడా కుదిరించుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.