Eturunagaram | ఏటూరునాగారం : ఏటూరు నాగారం మండలం దొడ్ల సమీపంలోని జంపన్న వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మల్యాల, కొండాయి, ఐలాపూర్ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. జంపన్న వాగుపై నిర్మించిన బ్రిడ్జి గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. అప్పటినుంచి వర్షాకాలంలో కొండాయి, మల్యాల, ఐలాపూర్ గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ మేడారం జాతర సందర్భంగా ఈ వాగుపై తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టారు. కాగా ఆ రోడ్డు కాస్త మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు తెగిపోయి వరద ప్రవహిస్తోంది. ప్రస్తుతం గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయినట్లే. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వాగు దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఆ గ్రామాల ప్రజలు, గిరిజనులు వైద్యం వ్యవసాయం ఇతర అవసరాల కోసం ఏటూరు నాగారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మార్గం తెగిపోవడంతో నిత్యవసర సరుకులకు సైతం ఇబ్బంది పడాల్సిందే. ఇదిలా ఉండగా గత ఏడాది ఈ వాగుపై ఐరన్‌తో ఫుట్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రయత్నాలు అధికారులు చేసినప్పటికీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి అధికారులు రవాణా సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు వేడుకుంటున్నారు.