కాజీపేట, జూలై 17 : కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో నిర్మిస్తున్న రైల్వే మల్టీ మాన్యుఫ్యాక్చ రింగ్ యూనిట్ (ఆర్ఎంయూ) వచ్చే మార్చిలో ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. జీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా కాజీపేటకు వచ్చి రైల్వే సర్క్యులేటింగ్ ఏరియా, అమృత్ భారత్ పథకం పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. రైల్వే క్రూ లాబీ, రన్నింగ్ రూంను తనిఖీ చేశారు. రైలు ఎల్పీలు, ఏఎల్పీలు, గార్డులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని అయోధ్యపురం శివారులో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించగా, షెడ్డు నిర్మాణ మ్యాప్‌ను రైల్వే సీపీఎంసీ మధుసూదనరావు క్షుణ్ణం గా వివరించారు.
అనంతరం ఆయన కార్యాలయంలో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. యూనిట్ షెడ్డులో నిర్మాణ పనులను ప్రతి సెక్షన్‌ను కలియ తిరిగారు. ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగం గా జరుగుతున్నాయ ని, ఈ ఏడాది డిసెంబర్ నాటి పూర్తవుతాయన్నారు. ప్రాజెక్టు ప్రారంభం కాగానే ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు.
అదేవిధంగా జనగామ రైల్వే స్టేషన్‌ను జీఎం తనిఖీ చేసి, అమృత్ భారత్ పథకంలో భాగంగా చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఆయన వెంట రైల్వే డీఆర్ఎం భర్తేశ్ కుమార్ జైన్, సీపీఎంసీ మధుసూదనరావు, జీఎం సెక్రటరీ శ్రీనివాసరావు, సీనియర్ డీఈఎన్ (కంట్ర క్షన్) రామారావు, ఆర్వీఎన్ఎల్ సీపీఎం సాయిప్రసా ద్, సీనియర్ డీఎన్ ప్రంజ్వల్ కేశవాణి, సీనియర్ డీఎంఈ వెంకట్ కుమార్, సీనియర్ డీఈఈ సూర్యనారాయణ పాల్గొన్నారు.
కాజీపేట రైల్వే స్థలంలో చేపట్టనున్న బస్టాండ్ ఏర్పాటు స్థల పక్రియను వేగవంతం చేయా లని, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని జీఎంను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ కోరారు. వారు ఈ మేరకు ఆర్ఎంయూ నిర్మాణంలో భూనిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, వరంగల్ ప్రాంతంలోని రైల్వే సమస్యలపై కలెక్టర్ సత్యశారద వినతి పత్రాలు అందజేశారు.