సంగెం, డిసెంబర్ 28: విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్రసాంకేతిక నైపుణ్యాలను వెలికి తీయాలని పాఠశాలల ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా మండలస్థాయి కృత్యమేళాను బుధవారం సంగెం జడ్పీహెచ్ఎస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన కృత్యాలను ప్రదర్శించారు. తెలుగులో 59, గణితంలో 62, ఆంగ్లంలో 43, ఈవీఎస్‌లో రూపొందించిన 29 కృత్యాలను ఆర్జేడీ పరిశీలించారు.
అనంతరం సంగెం ఉన్నత పాఠశాల హెచ్ఎం రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ప్రకృతి పరిసరాలపైన పరిశీలన, పరిశోధనాసక్తి రేకెత్తించేలా ఉపాధ్యాయుల బోధన ఉపకరణాలు ఉండాలన్నారు. విద్యార్థుల్లో మౌఖిక భాషా గణిత సామర్థ్యాల సాధనే లక్ష్యంగా ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి పూర్తయ్యే వరకూ తెలుగు భాషాకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వాలన్నారు.
వివిధ కృత్యాధార స్వయ అభ్యసన విద్యార్థులను పాఠ్యాంశ బోధనలో ఎంతగానో ఉపయోగపడుతాయని వివరించారు. అనంతరం తెలుగు గదికి సినారే పేరు, ఇంగ్లిషు గదికి సరోజీనాయుడు పేరు, గణిత గదికి శకుంతలాదేవి పేరు, ఈవీఎస్ గదికి ఏపీజే అబ్దుల్ కలామ్ పేరు పెట్టిన గదులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కలావతి, ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్, సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్లయ్య, ఎస్ఎంసీ చైర్మన్ నాగరాజు, పీజీ హెచ్ఎంలు విజయ, సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు.
కృత్యమేళాలతో పఠనాసక్తి పెంపు
ఖానాపురం: కృత్యమేళాలతో విద్యార్థుల్లో పఠనాసక్తి పెంపొందుతుందని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన మండల స్థాయి కృత్యమేళాను ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి మంగ్యానాయక్, ఏఎంవో సారయ్య, ఎంఈవో రత్నమాలతో కలిసి ఆయన కృత్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన కృత్యాల పనితీరును వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ కృత్యాల ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకోగలుగుతారని, ఎక్కువ కాలం గుర్తించుకుంటారని అన్నారు. ఇందులో 190 కృత్యాలను ప్రదర్శించినట్లు నోడల్ అధికారి మంగ్యానాయక్ తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం దూళం రాజేందర్, కాంప్లెక్స్ హెచ్ఎంలు మంజుల, సీఆర్పీలు రమేశ్, వీరస్వామి, ఐఈఆర్పీలు మహేందర్, రజిని పాల్గొన్నారు.
కృత్యాల ద్వారా బోధన సులభం
పోచమ్మమైదాన్: ఉపాధ్యాయులు తయారు చేసిన కృత్యాల ద్వారా పిల్లలకు బోధన కొనసాగిస్తే వారు సులభంగా నేర్చుకుంటారని జిల్లా అకాడమిక్ కో ఆర్డినేటర్ మాలోత్ సారయ్య అన్నారు. వరంగల్ మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్ కృత్యమేళాను మట్టెవాడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఎఫ్ఎల్ఎన్ కో ఆర్డినేటర్ జీ అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధానం పిల్లలకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. కార్పొరేటర్ ఆకుతోట తేజస్వి శిరీష్ మాట్లాడుతూ కృత్యమేళా ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకత వెలికివస్తుందని, పిల్లలకు బోధన హత్తుకునేలా ఉంటుందన్నారు.
కో ఆర్టినేటర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ తెలుగు-30, ఇంగ్లిష్-38, గణితం-29, పరిసరాల విజ్ఞానం-30, ఉర్దూ మీడియం నుంచి 39 కృత్యాలతో మొత్తం 166 ఎగ్జిబిట్లు పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో నుంచి జిల్లాస్థాయికి ప్రతి సబ్జెక్టు నుంచి 5, ఉర్దూ మీడియం నుంచి తొమ్మిది చొప్పున మొత్తం 29 జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు వివరించారు. వీరికి జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కే శ్రీనివాస్, ఇస్లామియా బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట్రామ్రెడ్డి చేతులమీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల కో ఆర్డినేటర్ డీపీసీ నర్సింహారావు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు డీ పుసారాం, కే రవికుమార్, జీ లక్ష్మయ్య, రఘునాయక్, రాష్ట్ర పరిశీలకుడిగా ఏవీఆర్చార్యులు, జడ్జిమెంట్ కమిటీ సభ్యులు, సీఆర్పీలు పాల్గొన్నారు.
జిల్లాస్థాయికి ఎంపికైన పాఠశాలలు..
మండలస్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఎగ్జిబిట్లల్లో జిల్లాస్థాయికి ఒక్కో సబ్జెక్టుకు ఐదు చొప్పున ఎంపిక చేశారు. తెలుగులో ఎంపీపీఎస్ ఆరెపల్లి (విజయ), ఎంపీయూపీఎస్ కొత్తపేట (డీ సాగర్), జీపీఎస్ ఓల్డ్ మార్కెట్ (ఏ కిరణ్), జీపీఎస్ మట్టెవాడ (టీ తులసీరాణి), జీపీఎస్ నరేంద్రనగర్ (బీ రమాదేవి), గణితంలో ఎంపీపీఎస్ ఆరెపల్లి (సీహెచ్ నాగేశ్వర్రావు), జీపీఎస్ మట్టెవాడ (ఏ హరిప్రసాద్), ఎంపీపీఎస్ సుందరయ్యనగర్ (జీ నాగేశ్వర్రావు), జీపీఎస్ నరేంద్రనగర్ (పీ ఝాన్సీ), ఎంపీపీఎస్ ఎనుమాముల (ఏ తిరుమల), ఆంగ్లంలో జీపీఎస్ ఉర్సు (ఖాజా జహీరోద్దీన్), జీపీఎస్ క్రిస్టియన్‌కాలనీ (ఏ శంకరయ్య), ఎంపీపీఎస్ పైడిపల్లి (ఎం మాధవి), జీపీఎస్ ఈస్ట్ఫోర్టు (మోహ్సినబేగం), జీపీఎస్ ఓల్డ్ మార్కెట్ (ఏ కిరణ్), పరిసరాల విజ్ఞానంలో ఎంపీపీఎస్ సుందరయ్యనగర్ (జీ శ్రీను), జీపీఎస్ గ్రేన్ మార్కెట్ (వీరస్వామి), జీపీఎస్ భగత్‌సింగ్‌నగర్ (కే శ్రీనివాస్), జీపీఎస్ ప్రతాప్‌నగర్ (టీ ప్రకాశ్), ఉర్దూ మీడియంలో ఉర్దూలో జీపీఎస్ ఇంతెజార్గంజ్ (ఖమరున్నీసాబేగం), జీపీఎస్ ఉర్సు (సయ్యద్ ఆశ్రఫ్ హుస్సేన్), జీపీఎస్ మాసూం అలీ (అలీం జాహెద్), జీపీఎస్ పోచమ్మమైదాన్ (ఫాతిమా అక్తర్), జీపీఎస్ చింతల్ (తబస్సుమ్ సుల్తానా), గణితంలో జీయూపీఎస్ ఎల్బీనగర్ (ఇస్రత్ సుల్తానా), జీయూపీఎస్ శివనగర్ (నుజ్రత్ పర్వీన్), పరిసరాల విజ్ఞానంలో జీపీఎస్ చాకరాసి కుంట (వహజుల్) జీపీస్ ఇండస్ట్రీయల్ కాలనీ (ఎంఏ మజీద్).
సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉచితంగా నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణలో ఎంఈవో రంగయ్య సారథ్యంలో నిర్వహించిన టీఎల్ఎం మేళాను మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కృత్యాధార బోధనా పద్ధతులతో విద్యార్థులకు విజ్ఞాన్ని సులభతరంగా అందించొచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, ప్రధానోపాధ్యాయుడు కడప సురేందర్, టీచర్లు పాల్గొన్నారు.