మొంథా తుపాను అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వేల ఎకరాల్లో వరి పంట నేలవాలగా.. లక్షల ఎకరాలను వరద ముంచెత్తింది. విపత్తు జరిగి 12 రోజులు గడిచినా వరద, బురద ఇంకా పొలాల్లోనే తిష్టవేసింది. దీంతో ఒకవైపు నేల వాలిన వరి కంకులు మొలకెత్తుతుండగా.. కోతలు రైతులకు భారంగా మారాయి. సాధారణ హార్వెస్టర్లు బురదలో దిగబడుతుండగా.. ట్రాక్ మిషన్లు అనివార్యమయ్యాయి. ఇదే అదనుగా సదరు హార్వెస్టర్ల యజమానులు ధరలు పెంచడంతో అన్నదాత మరింత నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
హనుమకొండ సబర్బన్, నవంబర్ 8 : మొంథా తుపాను దెబ్బకు రైతులు కుదేలయ్యారు. గత నెల 29న రోజంతా కురిసిన వానకు 30 నుంచి 42 సెంటీమీటర్ల భారీ వర్షపాతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలా ల్లో నమోదైంది. దీంతో ఇటు వరంగల్ నగరంతో పాటు అటు పంట పొలాలను వరద ముంచెత్తింది. అయితే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా మెజారిటీ మండలాల్లో వరి పొలాలు కోతకు వచ్చిన అకస్మిక వరదల కారణంగా 40 వేల ఎకరాల్లో పంట నేల వాలింది. మరో 1.10 లక్షల ఎకరాల్లో నీళ్లు చేరాయి. దీం తో తక్కువ ఖర్చుతో టైర్ హార్వెస్టర్లతో వరి కోతలు పూర్తి చేసుకునే రైతులపై పెనుభారం పడింది.
ఎకరం వరి కోసేందుకు రైతులు రూ.1800 ఖర్చుచేసేవారు. అయితే వరి నేలవాలడం తో ట్రాక్ మిషన్ల (చైన్ హార్వెస్టర్)తోనే వరి కోసే పరిస్థితి ఏర్పడింది. పొలాల్లో ఇంకా నీరుండడంతో టైర్ హార్వెస్టర్లు పొలాల్లో దిగబడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 72 ట్రాక్ మిషన్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో అవి రైతుల అవసరానికి సరిపోవడంలేదు. గతంలో వరి కోతల సమయంలో ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున హార్వెస్టర్లను ఏజెంట్లు ఇక్కడికి తీసుకొచ్చేవారు. అయితే ఆర్థిక నష్టాల వల్ల ప్రస్తుతం ఇతర రాష్ర్టాల హార్వెస్టర్లు రావడంలేదు. దీంతో జిల్లా పరిధిలో ఉన్న వాహనాలతోనే వరి కోసే పరిస్థితి ఏర్పడింది. అయితే మొన్నటి మొంథా తుపాను మూలంగా ట్రాక్ మిషన్లు అనివార్యంగా కావడంతో రైతులు వాటికోసం పరుగులు పెడుతున్నారు.
సందట్లో సడేమియాగా ట్రాక్ మిషన్ల యాజమానులు ధరలను ఆమాంతం పెంచేశారు. గతంలో గంటకు రూ. 2.200 నుంచి 2,500లోపు ధర ఉండగా, ఇప్పుటు ఏకంగా రూ. 3 వేల నుంచి మొదలుకొని రూ. 4,500 (మండలాన్ని బట్టి) వరకు రైతుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. అదే నేలవాలిన ఎకరం వరి కోతకు రూ.7 వేల నుంచి రూ. 8 వేల వరకు ఖర్చు భరించాల్సి వస్తుండడంతో అన్నదాతకు భారంగా మారుతున్నది. ప్రస్తుత వానకాలం పంటలో దిగుబడి ఖర్చును బేరీజు వేసుకుంటే 25 శాతం వరకు నష్టాన్ని చవిచూసే అవకామున్నట్లు రైతులు వాపోతున్నారు. దీనికి తోడు మిల్లర్లు సైతం భారీ కోతలు విధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహరంపై ప్రభుత్వం దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.