సుబేదారి, ఆగస్టు 13 : ఉమ్మడి వరంగల్ జిల్లాను ఈ నెల 31వరకు గుడుంబా రహిత జిల్లాగా మార్చాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో నాటుసారా నిర్మూలను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా గుడుంబా కేసుఅ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు రాష్ట్రంలో ఎక్కడా నాటు సారా కనిపించకూడదని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రతి జిల్లాలో కూడా గుడుంబాను పూర్తి స్థాయిలో నియంత్రించడానికి నెల రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకైన బెల్లంపై నిఘా పెట్టాలని, బెల్లం సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గుడుంబా కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ ఎన్డీపీఎస్ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికపుడు డిప్యూటీ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు సిబ్బందితో సమీక్ష నిర్వహించాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా మాట్లాడుతూ గుడుంబా, గంజాయి నియంత్రణకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డ్రగ్స్, నాటుసారా నియంత్రణకు ఎక్సైజ్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం గుడుంబా తయారీ దారులను ఆదుకుంది
గంజాయి నియంత్రణకు ఎక్సైజ్ శాఖ అధికారులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎక్సైజ్‌శాఖ ఈడీ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం నాటు సారా తయారీదారులను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఉపాధి కల్పించడానికి ప్యాకేజీ ఇచ్చిందన్నారు. మళ్లీ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో అక్కడక్కడా నాటుసారా తయారీ చేస్తున్నారన్నారు.
దీన్ని సహించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని ఈడీ హెచ్చరించారు. గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టి రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీపీ అంబర్ కిశోర్‌ఝా తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, వరంగల్ రేంజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు, ఐదు జిల్లాల సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు ఎస్సైలు పాల్గొన్నారు.