జయశంకర్ భూపాలపల్లి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో చేపట్టిన భూ భారతి రెవెన్యూ చట్టం 2025 ద్వారా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకున్న వారి భూ సమస్యలు పరిష్కారమయ్యేనా.. అని సందేహాలు తలెత్తుతున్నాయి. ఆగస్టు14లోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా 212 రెవెన్యూ గ్రామాల్లో 53202 అర్జీలకు ఇప్పటి వరకు 10 వేల వరకు మాత్రమే ఆన్లైన్ పూర్తయ్యింది. దరఖాస్తుల్లో అధిక శాతం సాదాబైనామా వినతి పత్రాలే ఉండడంతో సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్థానిక ఎన్నికల సైరన్ మోగనున్న తరుణంలో వీటిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అటకెక్కించగా, భూభారతిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఈ నెల 2 నుంచి 19 వరకు అధికారులు గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెలాఖరులోగా ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులు హడావిడి చేస్తున్నప్పటికీ ఆన్లైన్ చేయడానికి చాలా సమయం పడుతుందని ఆపరేటర్లు తెలుపుతున్నారు. సాదాబైనామాతో భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు పట్టా చేసుకోకపోవడంతో యజమానులు మరొకరికి పట్టా చేశారు. ఈ సమస్య అధికారులకు తలనొప్పిగా మారనుంది.
రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 14 నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం 45 రోజుల్లో 53202 దరఖాస్తులకు పరిష్కారం చూపడం కష్టమేనని రెవెన్యూ సిబ్బందే తెలుపుతున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికే ఈ సమయం సరిపోదని చెబుతున్నారు. భూపాలపల్లిలో 10,553 దరఖాస్తులు వచ్చాయి.
అలాగే రేగొండ మండలం నుంచి 4551, మొగుళ్లపల్లిలో 2565, గోరికొత్తపల్లిలో 3373, టేకుమట్లలో 1534, కాటారంలో 5610, మల్హర్‌లో 5372, గణపురంలో 5042, మహాముత్తారంలో 4687, మహదేవపూర్‌లో 2917, చిట్యాలలో 5570, పలిమెల మండలం నుంచి 1428 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఆన్లైన్ అనంతరం క్షేత్రస్థాయిలో రికార్డులు పరిశీలించి నోటీసులు ఇస్తామని, రికార్డులు సరిగా లేని దరఖాస్తులను తిరస్కరిస్తామని అధికారులు తెలుపున్నారు. విచారణ పేరుతో సగానికి పైగా దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లోగా స్థానిక ఎన్నికల నగారా మోగితే కోడ్ పేరుతో మళ్లీ పక్కన పెట్టి రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.