హనుమకొండ చౌరస్తా, జనవరి 20: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ మహాప్రదర్శనలో భాగంగా సోమ వారం హనుమకొండలో సన్నాహక ర్యాలీ తీశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్ వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామి, డప్పుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పుచప్పుళ్లతో ర్యాలీగా అంబేద్కర్ సెంటర్లోని విగ్రహం వద్దకెళ్లి పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మహాప్రదర్శనకు ఇంటికొకరు డప్పువేసుకుని తరలిరావాలన్నారు.
30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలికారన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సుప్రీంకోర్టు తీర్పు ఆదేశానుసారం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఒక వర్గానికి తలొగ్గి వర్గీకరణకు జాప్యం చేస్తే సహించేది లేదని, మాదిగల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో మొదటి నుంచి మాదిగలను మోసం చేస్తూ వస్తున్నదన్నారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న, మిట్టపల్లి సురేందర్, దరువు ఎల్లన్న, గిద్దె రాంనర్సయ్య పాటలతో అలరించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు పృథ్వీరాజ్, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంద కుమార్ మాదిగ, వేల్పుల సూరన్న, బొడ్డు దయాకర్, మంద రాజు, బండారి సురేందర్, గద్దల సుకుమార్, బొచ్చు తిరుపతి, మంద స్వరాజ్, కిరణ్, రాజేశ్ పాల్గొన్నారు.