ఏటూరునాగారం : ఏటూరునాగారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయురాలు వరలక్ష్మి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను ఎక్కువకాలం పనిచేసిన పాఠశాలలోని విద్యార్థులంతా తనవారే అనుకుని మనస్తత్వం కలిగిన వరలక్ష్మి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం గమనార్హం. తాను పనిచేసిన పాఠశాలలో పదవ తరగతిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నగదును ప్రకటించారు. ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులై 500 పైగా మార్కులు సాధించిన 19 మందికి నగదు అందించారు.
ఈ మేరకు స్థానిక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజకుమార్ లు విద్యార్థులకు ఈ నగదును సోమవారం అందజేశారు.
ఇదిలా ఉండగా 19 మంది విద్యార్థుల్లో పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రూ.6,000, రూ.5,000, రూ.4,000 చొప్పున అందించారు. అత్యధిక మార్కులు సాధించి ప్రథమ శ్రేణిలో నిలిచిన రామ హర్షిత్ కు రూ.6,000, ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన జాడి రాధికకు 5,000, తృతీయ శ్రేణిలో ఎండీ జాస్మిన్ కు 4,000 అందజేశారు. మిగతా 16 మందికి రూ.1000 చొప్పున అందించారు. ఈ సందర్భంగా సీఐ,ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంలో చదువుకొని ముందుకు సాగాలని సూచించారు.
పెద్ద మొత్తంలో విద్యార్థులకు నగదు అందజేసేందుకు ముందుకు వచ్చిన వరలక్ష్మి ఉపాధ్యాయురాలిని ఈ సందర్భంగా ప్రశంసించి ఆమె సేవలను కొనియాడారు. ఉపాధ్యాయురాలును ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది కూడా ముందుకు వచ్చి విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు మంచి మార్కులు సాధించడంతో పాటు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబశివరావు, వివేకానంద విద్యానికేతన్ పాఠశాల విద్యానికేతన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెండ్యాల ప్రభాకర్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.