పోలీసు శాఖలో సుదీర్ఘకాలంగా సేవలందించి, ఉద్యోగ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది కాలంగా అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు 70 నుంచి 80 మందికిపైగా అటెండర్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైలు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, ఆపైస్థాయి అధికారుల వరకు ఉద్యోగ విరమణ పొందారు. వీరందరూ ఏడాదిగా అ‘విశ్రాంత’ పోరాటం చేస్తున్నా విరమణ ప్రయోజనాలను సర్కారు అందించకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు.
– సుబేదారి, ఆగస్టు 9
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్, ఒకేసారి చెల్లించే మొత్తం(ల్యాంప్సంమ్), గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర ప్రయోజనాలను రిటైర్డు అయి న రెండు, మూడు నెలలలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి మినిమమ్ రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వస్తాయి. పైస్థాయి అధికారులకైతే రూ. 70 నుంచి రూ. 80 లక్షల వరకు అందుతాయి.
వీటి చెల్లింపుల ప్రక్రియను అడ్మిస్ట్రేటివ్ విభాగం అధికారులు సర్వీస్‌ను బట్టి రిటైర్డు అయిన ఉద్యోగి వివరాలను అటెండర్ నుంచి హెడ్‌కానిస్టేబుల్ వరకు లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీస్, ఏఎస్సై నుంచి పైస్థాయి వరకు ఏజీ ఆఫీస్ హైదరాబాద్ పంపిస్తారు. వెంటనే అప్రూవల్ అయిన తర్వాత ట్రెజరీ ద్వా రా వారి ఖాతాల్లో జమవుతాయి. కానీ ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో ఏడాది కాలంగా ఎవరికీ బెన్ఫిట్స్ అందలేదని రిటైర్డు సిబ్బంది, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చెల్లించలేక..
రిటైర్డు అయి ఏడాది గడిచినా రాష్ట్ర ప్రభు త్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడంతో, సర్వీస్‌లో ఉన్నపుడు పిల్లల ఉన్నత చదువులు, గృహ నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, కు టుంబ అవసరాలకు బ్యాంకు నుంచి తీసుకు న్న అప్పులు చెల్లించలేకపోతున్నామని వి శ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు. అప్పుల భారం పెరిగిపోతున్నదని ఆవేదన చెందుతున్నారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ప నిచేసిన శీలం బాలకృష్ణ 2024 మే 31 ఉద్యో గ విరమణ పొందారు. ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాది గడిచినా కూడా అందలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల గుండెపోటుకు గురై చనిపోయాడు. విరమణ ప్రయోజనాలందక రిటైర్డు సిబ్బంది, అధికారులు ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.