ఖిలావరంగల్ : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దుకాణాలు మరియు స్థాపనల చట్టం 1988లో సెక్షన్ 16, 17 కి సవరణ చేస్తూ ఎనిమిది గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ జులై 5న విడుదల చేసిన జీవో 242ను రద్దు చేయాలని కోరుతూ వరంగల్ కలెక్టర్కు కార్మికు సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఆర్టీయూ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కందిక చెన్నకేశవులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆరూరికుమార్ పాల్గొని మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం 10 గంటల పని దినాన్ని చట్టబద్ధం చేసి పెట్టుబడుదారులకు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల లాభాల కోసం ఈ జీవోను అమలు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు.
కార్మికులు తీవ్ర శ్రమ దోపిడికి గురయ్యే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సాధించుకున్న 8 గంటల పని దినాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. కార్మిక రంగంలో కొత్త సంస్కరణ పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ జీవోను రద్దు చేయాలని, అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లను నిరసిస్తూ ఈ నెల 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఇనుముల శ్రీనివాస్, తుమ్మల సాంబయ్య, ఎండీ మహబూబ్ పాషా, జన్ను రాజు, ప్రభాకర్, రాజేందర్, రమేష్, వాణి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.