ఏటూరునాగారం, ఆగస్టు 1 : ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, పోస్ట్మెట్రిక్ హాస్టల్స్ మరమ్మతు పనులకు నిధులు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. ఇది వరకు చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో కొత్త పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో పాఠశాలల పునఃప్రారంభం నాటికే పూర్తి చేయాల్సిన పనులు అలాగే పెండింగ్లో ఉన్నాయి. సరైన సౌకర్యాలు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జరు గుతున్న జాప్యంతో కొత్తగా మంజూరైన పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే ఐటీడీఏ ద్వారా మంజూరైన అనేక పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
వారికి పీడీ చెక్కులు అందజేస్తున్నా వాటికి చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉన్నది. పనులు చేసిన తర్వాత పైరవీకారులను పట్టుకొని బిల్లులు పొందాల్సి పరిస్థితి వచ్చిందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం ద్వారా మంజూరు చేసే పనులకు ఇక్కడ నుంచే బిల్లుల చెల్లింపు జరిగేది. ప్రస్తుతం ఇతర శాఖల మాదిరిగానే ఐటీడీఏ బిల్లు ల చెల్లింపులు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 125 ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు గిరిజన సంక్షేమశాఖ విభాగం ద్వారా రూ.18.36 కోట్లను మంజూరు చేశారు. పాఠశాల ల్లో ఏయే పనులు చేపట్టాలో గుర్తించి అంచనా వ్యయాలు తయారు చేశారు. ఇందులో ప్రధానంగా పాఠశాలలు, తరగతి గదుల్లో ఫ్లోరిం గ్, కిటికీలకు మెష్డోర్లు, పైకప్పు, నీటి సరఫరా, పెయింటింగ్, ఎలక్ట్రికల్, ప్యాచ్ వర్క్లు, ప్రహరీ నిర్మాణం, బిల్డింగ్ కండీషన్లకు ప్రాధాన్యం ఇచ్చారు. వీటిల్లో ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్స్ మరమ్మతు, పైపులైన్ల ఏర్పాటు, కిచెన్ షెడ్ల నిర్మాణం, డార్మెటరీ, డైనింగ్ హాలులో ఆధునీకరణ, తదితర పనులు అవసరంగా అధికారులు గుర్తించారు.
ములుగు జిల్లాలో 43 పనులకు రూ. 8.71 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13 పనులకు రూ. 57లక్షలు, హనుకొండ జిల్లా లో 13 పనులకు రూ.73 లక్షలు, జనగామ జిల్లా లో 10 పనులకు రూ.1.95 కోట్లు, వరంగల్ జిల్లాలో 12 పనులకు రూ.79 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 34 పనులకు రూ. 6.54 కోట్లు మంజూరయ్యాయి. పాఠశాలల్లో ఆయా పనులను బట్టి రూ.3లక్షల నుంచి రూ.30లక్షల వరకు కేటాయించారు. చిన్న చిన్న పనులకు వీడీసీలు ముందు కు వస్తున్నారు. పెద్ద పనులు టెండర్ ద్వారా పొందేందుకు ముందు కు రాకపోవడంతో వీడీసీలకు నేరుగా రూ.25 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉండడంతో పనుల విలువలను కూడా తగ్గించి అంచనా తయారు చేశారు. ఇక ఇంజినీరింగ్ అధికారులే కాంట్రాక్టర్లను బుజ్జగిస్తూ పనులు చేయాలని బతిమిలాడుతున్నట్లు సమాచారం.