నాటికలు.. నాటికాలంలో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాయి. వినోదాన్ని పంచడంలోనూ ప్రధాన సాధనంగా వెలుగొందాయి. కానీ, సినిమాలు, టీవీ సీరియళ్ల రాకతో.. ప్రజల వినోద ప్రాధాన్యతలు మారాయి. ఫలితంగా, రంగస్థలం నిరాదరణకు గురై.. సంప్రదాయ నాటక ప్రక్రియలు క్రమంగా కనుమరుగై పోయాయి. అయితే, కొందరు లబ్ధప్రతిష్ఠులైన రచయితలు.. తమ రచనలతో నాటక పునరుజ్జీవనానికి కృషి చేశారు. అలాంటివారిలో రావుల పుల్లాచారి ఒకరు. తన రచనలతో తెలుగు నాటకరంగానికి సరికొత్త శోభను తీసుకొస్తున్నారు.
రంగస్థలంపై తెలంగాణ యాసకు పట్టం కడుతున్నారు. నేటితరం ఆలోచనా ధోరణికి తగినట్లుగా నాటకాలు రాస్తూ.. సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మక నంది పురస్కారం కూడా అందుకున్నారు. మన సంస్కృతికి, భాషకు నాటకాలే సజీవ సాక్ష్యాలని చెప్పే రావుల పుల్లాచారి నుంచి వచ్చిన మరో పుస్తకమే.. ఈ వీలునామా. ఇందులో ఆరు నాటికలు ఉండగా.. ప్రతిదీ ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని అందించేదే!
నేటి సమాజంలో క్షీణిస్తున్న మానవ సంబంధాలు, కుటుంబ విలువలను ‘వీలునామా’ కళ్లకు కడుతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కాదని, వారి ఆస్తులే ముఖ్యమని భావించే కొడుకుల కథ ఇది. ఇందులో తండ్రి జగన్నాథం. ఆయన పోషణ బాధ్యతల్ని ఇద్దరు కొడుకులు.. చెరో నెల చొప్పున తీసుకుంటారు. పెద్దాయన ఎప్పుడు చనిపోతాడా? ఎప్పుడెప్పుడు ఆయన పీడ విరగడ అవుతుందా? అని ఎదురుచూస్తుంటారు. ఒకరోజు చిన్న కోడలుకు జగన్నాథం రాసిన వీలునామా దొరుకుతుంది. అది చదివిన చిన్న కొడుకు-చిన్న కోడలు.. ఆస్తిపై ఆశతో జగన్నాథంపై లేనిపోని ప్రేమను కురిపిస్తారు. పెద్ద కొడుకు ఇంటికి పంపకుండా తమ దగ్గరే ఉంచుకుంటారు.
కానీ, అసలు నాటకం వేరే ఉన్నదని ఆ తర్వాతే తెలుస్తుంది. మనిషిలో విలువలు రోజురోజుకూ పతనం అవుతున్నాయనీ, తనది కానిదాని కోసం పరుగులు పెడుతున్నాడని ‘పథనం దిక్కు పరుగు’ నిరూపిస్తుంది. పేద కుటుంబం నేపథ్యంలో సాగే సమస్యాత్మక నాటిక.. ‘సన్ స్ట్రోక్’. డబ్బు ముందు ప్రేమ ఎప్పటికీ ఓడిపోదనే సత్యాన్ని వెల్లడిస్తుందీ నాటిక. సమాజంలో పెరుగుతున్న కామోన్మాదులను రోడ్లపై తిరిగే పిచ్చి కుక్కలతో సమానమని చెబుతూ రాసిన నాటిక ‘కుక్కల బండి’. మరో నాటిక.. ‘దోభూచులాట’. పదునైన సంభాషణలతో, ఎత్తుకు పైఎత్తులతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఓ వ్యక్తి తన తప్పు తెలుసుకొని సన్మార్గంలో నడిస్తే.. ఎంతటి సమస్య అయినా పరిష్కారం అవుతుందన్న నీతిని వెల్లడిస్తుంది. ఇక డబ్బుతో విశ్వాసాన్ని కొనలేమని, సత్యంతో మాత్రమే విశ్వాసాన్ని గెలుచుకుంటామని.. ‘మా ఊరు’ నాటిక చాటుతుంది. ఈ ఆరు నాటకాల ద్వారా ఆరు విభిన్నమైన సమస్యలను పాఠకులు, ప్రేక్షకుల ముందుంచారు రచయిత.
రచయిత: రావుల పుల్లాచారి
పేజీలు: 125, ధర: రూ.200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 99492 08476
-శ్రీనివాస్ చిల్ల