కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్‌ను నియమించకపోవడంతో పాలన కుంటుపడుతోంది. ఇన్చార్జి వీసీ సైతం దృష్టి కేంద్రీకరించకపోవడంతో మూడు నెలలుగా ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. వాటిని ఇన్చార్జి వీసీకి తెలియజేయడంలో రిజిస్ట్రార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సైన్స్ ఫ్యాకల్టీకి డీన్‌ను నియమించకపోవడం, ఫ్రొఫెసర్ల ప్రమోషన్లలో జాప్యం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
– హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 5
యూనివర్సిటీ సైన్స్ విభాగాల్లో పనిచేసే ప్రొఫెసర్లలో సీనియర్‌కు డీన్ బాధ్యతలు ఇవ్వాల్సి ఉంది. మే 31న రిజిస్ట్రార్ మల్లారెడ్డి డీన్‌గా పదవీ కాలం పూర్తయింది. ఆ తర్వాత సీనియర్‌ను నిర్ణయించడంలో వివాదం నెలకొంది. గతంలో ఇలాంటి వివాదం తలెత్తినప్పుడు మొదట అపాయింట్ అయిన వారికే డీన్ బాధ్యతలను అప్పజెప్పారు. నిబంధనల ప్రకారం చూస్తే మల్లారెడ్డి తర్వాత కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ హన్మంతుకు ప్రస్తుతం ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్ అయ్యే అవకాశం ఉండగా, రిజిస్ట్రార్ మల్లారెడ్డి తన సామాజికవర్గానికి చెందిన వారిని నియమించేందుకే జాప్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కేయూ కో ఎడ్యుకేషన్, మహిళా ఇంజినీరింగ్ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను ఇప్పటి వరకు నియమించలేదు. ఒకరినే ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా కొనసాగించడంలో విమర్శలు తలెత్తుతున్నాయి. కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ వారిని ప్రిన్సిపాల్‌గా చేసే అవకాశం ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని ఇన్చార్జి వీసీ దృష్టికి తీసుకెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేయూలోని 28 విభాగాల్లో సరైన సంఖ్యలో ప్రొఫెసర్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పార్ట్‌టైం టీచింగ్ అవసరాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు డిపార్ట్మెంట్ కమిటీ ద్వారా ఎలాంటి నియామకాలు జరపలేదు. కొత్త నియామకాలు లేక, విద్యార్థుల కు సరైన సమయంలో సిలబస్ పూర్తికాక పరీక్షలను వాయిదా చేయాల్సిన పరిస్థితి ఎదురైందని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వివిధ గ్రేడుల్లో పదోన్నతి పొందడానికి రెండు నెలల కిందట ఆకుట్ డిమాండ్‌తో నోటిఫికేషన్ జారీ చేసినా వీసీ లేకపోవడంతో ఇప్పటివరకు పదోన్నతుల ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచగా, వీసీ రానంతవరకు ఇలా గడువు పెంచుకుంటూపోతే పదోన్నతులు రాక నష్టపోయే పరిస్థితి ఎదురవుతుందని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇన్చార్జి వీసీ చొరవ తీసుకొని పదోన్నతుల ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను ఇన్చార్జి వీసీ దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. నిబంధనల ప్రకారమే సైన్స్ డీన్‌ను నియమిస్తాం. సీనియారిటీ, క్యాడర్ ప్రకారం ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకుని వారినే నిర్ణయం తీసుకొమ్మని ఇన్చార్జి వీసీ చెప్పారు. రెండు రోజుల్లో వారినే డిసైడ్ చేసుకొమ్మని చెబుతాం. 17 సంవత్సరాల్లో నా సామాజికవర్గం అంటూ ఎప్పుడూ చూడలేదు. 2010 పదోన్నతుల విషయంలో సర్వీస్ ప్రాబ్లం ఉంది. కోర్టులో ఉంది. అందుకే ఆలస్యమవుతోంది. పార్ట్‌టైం నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి యూనివర్సిటీకి డబ్బుల్లేవు. ఇంజినీరింగ్ కాలేజీలకు కూడా ఇద్దరు ప్రిన్సిపాళ్లను నియమించాల్సి ఉంది. మేడం దృష్టికి తీసుకెళ్లాం.
– పెరటి మల్లారెడ్డి, కేయూ రిజిస్ట్రార్