హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29: విద్యార్థుల్లో ధైర్యం, త్యాగం పెంపొందాలని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ డీన్ స్టూడెంట్ అఫైర్స్, సోషాలజీ, సోషల్ వర్క్ విభాగాలు సంయుక్తంగా జనవరి 3 న నిర్వహించనున్న ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను రిజిస్ట్రార్ రాంచంద్రం, డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, కేయూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్, సోషాలజీ, సోషల్ వర్క్ విభాగాధిపతి ఎం. స్వర్ణలత, ఆ విభాగపు ప్రొఫెసర్ కే.సుభాష్, కే.ప్రసన్న, ఎస్.సాహితీ, ఎం.జాస్మిన్, బి.రజిత, ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రిజిస్ట్రార్ రాంచంద్రం మాట్లాడుతూ.. మినిస్టర్ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆదేశాల ప్రకారం దేశం కోసం, ధర్మం కోసం కేవలం 7 సంవత్సరాల వయసులో ప్రాణాలను త్యాగం చేసిన జోరావర్సింగ్, ఫతే సింగ్‌ల స్మారకార్థం ‘వీర్ బాల్ దివస్’ను జనవరి 3న కేయూ సెనేట్‌హాల్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మామిడాల ఇస్తారి, స్వర్ణలత మాట్లాడుతూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ‘వీర్ బాల్ దివస్- జాతి నిర్మాణానికి స్ఫూర్తి’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు, కేయూ పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీల విద్యార్థులు పాల్గొనవచ్చని, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి 2 చివరి తేదీగా నిర్ణయించామని, రిజిస్ట్రేషన్‌కు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.