వరంగల్ చౌరస్తా: ప్రసూతి వైద్యం కోసం వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళ ప్రాణాలు పోయే పరిస్థితి కల్పించిన వైద్యులపై(Negligent doctors) చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల డిమాండ్ చేశారు. ఐద్యా ప్రతినిధులు, బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల ప్రాంతానికి చెందిన ఈర్ల వెన్నెలకు మార్చి 11వ తేదీన సీకేఎం హాస్పటల్ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించగా మగ శిశువుకు జన్మనిచ్చింది. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి యువతి పొట్టలో ప్యాడ్ (దూది పోరలు) మర్చిపోయి కుట్లు వేసి డిశ్చార్జ్ చేశారు.
మూడు రోజులు గడిచిన తరువాత యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాటుగా మల, మూత్ర విసర్జనకు తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో పాటుగా ప్రాణాపాయస్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు యువతి పొట్ట భాగంలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా పెరిగిపోయిందని గుర్తించి తిరిగి శస్త్రచికిత్స నిర్వహించారు. పొట్టలోనే ఉండిపోయిన ప్యాడ్స్‌ను తొలగించారు.
ఈ ఘటనపై ఐద్వా ప్రతినిధులు స్పందిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైద్యులపై కలెక్టర్ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా వైద్యఖర్చులు పూర్తిగా ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తూ హాస్పటల్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సీకేఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షర్మిళ, ఆర్ ఎంఓ డాక్టర్ మురళిలకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.