స్టేషన్ ఘన్పూర్, జూన్ 4 : రేషన్ బియ్యాన్ని చిరిగిన బస్తాల్లో షాపులకు సరఫరా చేయొద్దని, డీలర్లు నష్టపోకుండా ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సరైన తూకం వేయాలని ఇన్చార్జి ఖాసీంను జనగామ జిల్లా సివిల్ సప్లయ్స్ మేనేజర్ హతిరాం ఆదేశించారు. బుధవారం ‘రేషన్.. పరేషాన్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మూడు నెలలకు సంబంధించి రేషన్ డీలర్లకు 3212.451 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అలాట్ చేశామని, ఇందులో 1259.179 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు.
ఇంకా 1953.272 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉందన్నారు. కొన్ని చిరిగిన సంచుల్లో బియ్యం సరఫరా చేసే క్రమంలో డీలర్లకు తక్కువగా వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో చిరిగిపోయిన బస్తాలు సరఫరా చేయొద్దని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జిల్లా మేనేజర్ కృష్ణను సైతం ఆదేశించినట్లు హతిరాం పేర్కొన్నారు. కాగా సివిల్ సప్లయ్స్ ఏఎస్వో ఇర్ఫాన్ ఆహ్మద్ ఖాన్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రవణ్ ఎంఎల్ఎస్ పాయింట్‌లోని బియ్యం బస్తాలను బుధవారం పరిశీలించారు.