కరీమాబాద్, మార్చి 1 : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను కాదని.. మా మునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం అధికార బీజేపీ, కాంగ్రెస్ పా ర్టీల నాయకులు పోటీపడ్డారు. ఈ ఘటన తమదంటే తమదేనంటూ వారి నాయకుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేయగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే సామాన్యులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే హడావుడి చేసే పోలీసులు అధికార పార్టీల నాయకుల విషయంలో మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యహరించారు.
వివరాల్లోకి వెళితే మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం మామునూరు ఎయిర్పోర్టు గేటు వద్ద బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటానికి పుష్పాభిషే కం నిర్వహించి సంబురాలను చేపట్టారు. దీంతో తామేం తక్కువ అన్నట్లుగా కాంగ్రెస్ నాయకులు సైతం సంబురాలు చేసుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఇరు పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.
అనంతరం ఒకే టెంట్ కింద రెండు పార్టీల నాయకులు పుష్ప, క్షీరాభిషేకాలునిర్వహించారు. కాగా, ఈ రెండు పార్టీల హం గామాను చూసి స్థానికులు మండిపడ్డారు. ఎయిర్పోర్టు మూతపడిన నాటి నుంచి కేంద్రంలో ఉన్నది బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలేఅంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చాకే మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చిందంటున్నారు. కాగా, ఎన్నికల కోడ్ ఉన్నా.. వరంగల్ కొత్తవాడలోని కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ వద్ద శనివారం కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.