ఏటూరునాగారం, జనవరి 9 : ఇదేంటి.. ముగ్గు ల్లో గణిత ఫార్ములా లు.. సైన్స్ పాఠ్యాంశాలు ఉన్నాయనుకుంటున్నా రా? అవును.. అవి రంగోలీ పాఠాలే.. అది కూడా బాలుర పాఠశాలకు చెందిన 5 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు వేసినవే.. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండ ల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాల విద్యార్థులకు జన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వారిలో సాంకేతిక నైపుణ్యత, సృజనాత్మకత పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
అందుకు తగ్గట్లుగానే శాస్త్ర, సాంకేతిక, పరిసరాల పరిజ్ఞానం, గణిత, సామాన్య శాస్ర్తానికి సంబంధించిన అంశాలతో అందమైన, ఔరా అనిపించే రంగవల్లులను తీర్చిదిద్దారు. వీరిలో అద్భుత ప్రతిభను కనబర్చిన 18 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రేఖా గణితం, పరిసరాల పరిజ్ఞానం, సామాజిక శాస్త్రం, జీవశాస్త్రం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, దీంతో విద్యార్థులకు డ్రాయింగ్ నైపుణ్యం పెంచుకునే అవకాశం లభించిందన్నారు. తక్కువ ఖర్చుతో బోధనాభ్యాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.