నల్లబెల్లి, మార్చి 22: గత ప్రభుత్వాల హయాంలో బీళ్లుగా ఉన్న భూములు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. నీళ్లు లేక నెర్రెలు వారిన చెరువులు, కుంటలు గోదారమ్మ పరవళ్లతో నిండుకుండలను తలపిస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో సాగునీరు అందక లక్షలాది ఎకరాలు బీడుగా మారి అన్నదాత అరిగోస పడితే.. సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి పచ్చని పంటలతో రైతన్న కళ్లల్లో ఆనందం చూస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోనే అతిపెద్ద రంగాయ చెరువు పూర్వ వైభవం సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషితో గోదావరి జలాలు మండలానికి తరలివచ్చాయి.
పెరిగిన భూగర్భ జలాలు
గోదావరి జలాల రాకతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సైతం పెరగడం వల్ల బావులు, బోరుల్లో నీరు ఉబికి వస్తున్నది. అలాగే, గొలుసుకట్టు చెరువుల్లోకి నీరు చేరడంతో నేడు నిండుకుండల్లా మారాయి. దీంతో రంగాయ చెరువు ఆయకట్టుతోపాటు బావులు, బోరుల కింద రైతులు వరితోపాటు మక్కజొన్న, యాసంగి పత్తి, నువ్వులు, బబ్బెర, అలసందలు, పచ్చజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి జలాల పరవళ్లు..
గోదావరి జలాలను రామప్ప సరస్సులోకి పంపింగ్ చేస్తూ.. రామప్ప పంప్‌హౌస్ నుంచి నేరుగా పైపులైన్ల ద్వారా పాకాల, రంగాయ చెరువు, మాదన్నపేట పెద్ద చెరువులోకి గోదావరి జలాలను తరలించి అన్నదాత కళ్లల్లో ఆనందం నింపుతున్నారు. గోవిందాపూర్, పంతులుపల్లె, మామిండ్ల వీరయ్యపల్లె, రుద్రగూడెం ఒల్లెనర్సయ్యపల్లె, గుండ్లపహాడ్ గ్రామాలకు చెందిన రైతులు రంగాయ చెరువు ఆయకట్టు కింద సుమారు వెయ్యి ఎకరాల్లో యాసంగి వరి సాగు చేశారు. మండలానికి పెద్దదిక్కుగా ఉన్న రంగాయ చెరువు అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోకపోవడంతో ఒక్క పంటకు కూడా సాగునీరందని పరిస్థితి ఉండేది. కానీ, నేడు ఎమ్మెల్యే పెద్ది కృషితో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎర్రాయి చెరువు, రంగాయ చెరువును అనుసంధానం చేసి ఏడు గ్రామాల ముంపును నివారించి, ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో మినీ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దింది.
రెండు పంటలకూ సాగునీరు
రంగాయ చెరువు కింద నాడు ఒక్క పంటకు కూడా సాగు నీరందకుండె. నేడు సీఎం కేసీఆర్ సార్ సహకారంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గోదావరి జలాలను రప్పించి రెండేళ్లుగా రెండు పంటలకు సాగు నీరందిస్తుండడం ఆనందంగా ఉంది. నాడు మార్చిలోనే రంగాయ చెరువు ఆయకట్టు భూములు ఎడారిని తలపించేవి. నేడు గోదావరి జలాల రాకతో రంగాయ చెరువు, ఎర్రాయి చెరువుతోపాటు ఈ ప్రాంత గొలుసుకట్టు చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో రెండు పంటలు పండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు సరఫరా, రైతుబంధు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తుండడం వల్ల అధిక దిగుబడి సాధిస్తున్నాం. రైతు బాంధవుడైన ముఖ్యమంత్రి కృషి ఎనలేనిది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండి రుణం తీర్చుకుంటాం.
– గుజ్జ సంపత్‌రావు, రంగాయ చెరువు ఆయకట్టు రైతు