హనుమకొండ చౌరస్తా, జనవరి 21 : ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లిక సారాభాయ్ నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. రామప్ప ఫెస్టివల్లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కుడా గ్రౌండ్లో శనివారం రాత్రి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యప్రదర్శన అలరించింది. ఏడు పదుల వయస్సులో మల్లిక సారాభాయ్ తన బృందంతో కలిసి 70 నిమిషాల పాటు చేసిన నృత్యప్రదర్శన అదరహో అనిపించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్-రేవతి దంపతులు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, పోలీస్ కమిషనర్ రంగనాథ్, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పాపారావు పాల్గొని నృత్య ప్రదర్శనను వీక్షించారు. మల్లిక సారాభాయ్ బృందం నృత్యప్రదర్శనను తిలకిస్తూ కళాకారులు, ప్రజలు చప్పట్లతో ఎంకరేజ్ చేస్తూ అభినందించారు. వారి నృత్యప్రదర్శనకు మంత్రముగ్ధులయ్యారు.
ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ రామప్పలో నృత్యప్రదర్శనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని, హనుమకొండ నగరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మల్లిక సారాభాయ్ అద్భుతమైన నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిథులు కళాకారులను అభినందించి ఘనంగా సత్కరించారు.