భీమదేవరపల్లి, జూలై 04: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ఆలయాలకు సంబంధించిన 1295 ఎకరాల వ్యవసాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఏసీ రామాల సునిత తెలిపారు. శుక్రవారం మండలంలోని కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1062 వరకు ఆలయాలు ఉండగా వాటి ఆధీనంలో 3295 ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు. ఇందులో 210 ఆలయాలకు సంబంధించిన 1295 ఎకరాల వ్యవసాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వెల్లడించారు.
దీంతో ఆలయాలకు సంబంధించిన నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మొదటగా మహబూబాబాద్ జిల్లాలోని అగస్తేశ్వరాలయంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 458 ధూప, దీప నైవేద్యాల కింద ఆలయాలు ఉండగా నూతనంగా మరో 282 దరఖాస్తులు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. వర్షాలు సంమృద్ధిగా కురిస్తే ఆలయాల్లోని భూముల్లో వన మహోత్సవ కార్యక్రమాలను చేపడతామన్నారు. ఆమెతోపాటు ఆలయ ఈవో కిషన్ రావు ఉన్నారు.