రాఖీ అంటే రక్ష. రాఖీ అంటే ఒక భద్రత.. ఒక భరోసా. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల అనురాగం, ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్. తోబుట్టువులు మధ్య అనుబంధాల పూలు పూయించే రాఖీ పండుగ నేడే. ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షిస్తూ.. ‘నువ్వు నాకు రక్ష.. నీకు నేను’ రక్ష అంటూ రాఖీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు.
– నర్సంపేట రూరల్ / శాయంపేట, ఆగస్టు 30
కాలానుగుణంగా రాఖీలు కొత్త కొత్త డిజైన్లలో వస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాకేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో భారీగా దుకాణాలు వెలిశాయి. వారం ముందు నుంచే అమ్మకాలు జోరందుకున్నాయి. గతంలో రెండు, మూడు షాపులు మాత్రమే ఉండగా వీధివీధికో చిన్న స్టాళ్లు వెలిశాయి. పండుగ సందర్భంగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రాఖీ స్టాల్స్‌తో పాటు స్వీట్‌హౌస్‌లు, ఇతర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
ఏటా శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధన్(రాఖీ) పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. రాఖీ పండుగపై పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అలెగ్జాండర్ చక్రవర్తితో ఆ కాలంలో జరిగిన యుద్ధంలో పురుషోత్తముడనే రాజు ఓటమి పాలవుతాడు. అతడిని బంధీ చేసి తీసుకువెళుతున్న సమయంలో ఆయన భార్య రాణి సంయుక్త అలెగ్జాండర్ వద్దకు వెళ్లి చేతికి రాఖీ కడుతుంది. దీంతో సంయుక్తను చెల్లెలుగా భావించి అలెగ్జాండర్ ఏం కావాలో కోరుకోమంటే తన భర్త పురుషోత్తముడిని బంధ విముక్తుడిని చేయాలని వేడుకుంటుంది. వెంటనే పురుషోత్తముడిని విడుదల చేసి సంయుక్తకు విలువైన కానుకలు ఇచ్చి అలెగ్జాండర్ వెళ్లిపోతాడు. దీనిని బట్టి అప్పటికే రాఖీ పండుగ ఉందని పలువురు చెబుతారు. అలాగే దుష్టశక్తులను పారదోలడానికి యుద్ధంలో విజయం సాధించడానికి రక్షా బంధన్ ధరించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఏదైనా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యం గురించి గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాల్లో ఈ రక్షధారణ తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. కాలక్రమేణా రక్షను సోదర ప్రేమకు చిహ్నంగా కట్టే విధానం వచ్చింది. ఈ రక్షను కట్టడంలో ముఖ్య ఉద్దేశం..వారి క్షేమాన్ని కోరడమే.