ఎదురుచూపులకు తెరదించుతూ వాన వచ్చింది.. రోజంతా కమ్ముకున్న ముసురుతో ఉమ్మడి జిల్లా తడిసిముద్దయింది. ఉపరితల ఆవర్తనంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసి ప్రస్తుత సీజన్లో వ్యవసాయానికి ఊతమిచ్చింది. తాజా వానలతో వరినాట్లు ఊపందుకోనుండగా, ఇక సాగు పనులు ముమ్మరం కానున్నాయి. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో అత్యధికంగా 9.8సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, మానుకోట జిల్లా సీరోలు మండలంలో అత్యల్పంగా 0.6 సెంటీ మీటర్లు కురిసింది.
-వరంగల్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిన్నమొన్నటిదాకా ముఖం చాటేసిన వాన.. ఎట్టకేలకు సోమవారం రాత్రి నుంచి రోజంతా కురిసింది. మంగళవారం రాత్రి వరకు ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ముసురు, మోస్తరు వానలే అయినా ప్రస్తుత సీజనులో సాగుకు ఇవి ఉపయోగకరంగా మారాయి. ములుగు, హనుమకొండ జిల్లాల్లో మోస్తరుగా, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లిలో ముసురు వానలు పడ్డాయి. నారు పోసి నెల దాటినా ఇన్నాళ్లూ వానలు లేక నాట్లు పడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండిన చెరువుల్లో ఉన్న నీళ్లు, ఇప్పుడు ముసురు వానలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. నీటి వసతి ఉండడంతో ఈసారి వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది. సాగునీటి ప్రాజెక్టులతో ఎండాకాలంలోనూ చెరువులు నిండి ఉన్నాయి. ఇప్పుడు వానలు పడుతుండడంతో అంతటా నీళ్లు వస్తున్నాయి. ఇన్నాళ్లు తక్కువ వర్షపాతం నమోదు కాగా, తాజా వానలతో సాధారణ స్థాయికి చేరుతున్నది. ములుగు జిల్లాలో 6.9 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లాలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లాలో 2.8 సెంటీమీటర్లు, జనగామ జిల్లాలో 1.6 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు
వాజేడు : ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్నది. వాజేడు మండలం పేరూరు వద్ద మంగళవారం సాయత్రం 7 గంటలకు 11.080 మీటర్ల (36 అడుగుల) ఎత్తుతో పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన వర్షాలతో బొగత జలపాతం ఉధృతంగా దుంకుతు న్నది. పాలసంద్రంలా మారి సోయగాలు ఒలకబోస్తుండగా, పర్యాటకులు జలపాతం అందాలను వీక్షిస్తూ మైమరచిపోతున్నారు. ఉధృతి ఎక్కువ ఉండడంతో స్విమ్మింగ్ఫూల్లోకి అనుమతిని నిలిపివేశారు. కొంగాల వీఫాల్స్(దూసపాటిలొద్ది జలపాతం)కు సైతం అనుమతిని నిలిపివేశారు.
అక్కడక్కడా అధికం..
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. నడికూడ 8.5, కమలాపూర్‌లో 8.3, ఏటూరునాగారం 8.2, వెంకటాపూర్ 8.2, పరకాల 8.1, హసన్‌పర్తి 7.5, రేగొండ 7.4, దామెరలో 7.3, ఎల్కతుర్తి 7.3, గోవిందరావుపేట 7.3, ఆత్మకూరు 7, తాడ్వాయి 6.7, శాయంపేట 6.6, మంగపేట 6.6, వెంకటాపూర్ 6.5, చిట్యాలలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలంలో అతి తక్కువగా 0.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బయ్యారంలో 0.9, మహదేవపూర్ 1.8, వర్ధన్నపేట 1.1, బచ్చన్నపేట 1.1, పాలకుర్తి 1.2, లింగాలఘనపురం 1.2, పర్వతగిరి 1.6, ఐనవోలు 1.9, పలిమెలలో 2.1 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. బుధవారం, గురువారం సైతం ఆరు జిల్లాల్లో వానలు కొనసాగుతాయని వాతావరణ శాఖ సూచించింది.
సమ్మక్క బరాజ్‌కు భారీ వరద
కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తూపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. మంగళవారం ఎగువ నుంచి బరాజ్‌లోకి 2 లక్షల 56 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బరాజ్ నీటిమ ట్టం 81 మీటర్లకు చేరుకోవడంతో 59 గేట్లకు గాను 40గేట్లను ఎత్తి దిగువకు పంపిస్తున్నారు.