మరిపెడ, ఆగస్టు 3: ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు బాసనపల్లి రాములు తెలిపిన ప్రకారం.. గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు జాబితాలో పేరు వచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టే క్ర మంలో మొదటి జాబితాలో పేరు లేదని చెప్పారు.
ఈ విషయా న్ని ఎప్పటికప్పుడు దాటవేస్తుండడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. గత్యంతరం లేక రాములు గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తామని, సెల్ టవర్ దిగాలని గ్రామస్తులు చెప్పినప్పటికీ వినలేదు. వెంట నే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని నచ్చజెప్పినా దిగిరాలేదు.
వెంటనే స్థానికులు ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్కు విషయం తెలపడంతో స్పందించిన ఆయన బాధితుడి భార్యతో ఫోన్లో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాములు టవర్ దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులకు మొదటి విడతలో ఇండ్లు వచ్చాయో కమిటీ సభ్యులు చెప్పడం లేదు. అర్హుల జాబితాపై స్పష్టత లేకపోవడంతో గ్రామస్తులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పుటికైనా అధికారులు స్పందించి ఇండ్లు వచ్చిన వారి వివరాలు వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.