జనగామ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా కేంద్రంలో చేనేత కార్మికులు చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, చేనేత ఇకత్ ప్రింట్ అవుట్ చీరెలకు నిరసనగా చీరెను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రాచీన చేనేత కల కనుమరుగయ్యేలా సూరత్, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో బడా కంపెనీలు పోచంపల్లి ఇకత్ గుర్తింపు పొందిన చీరెలను అచ్చం ప్రింట్ చేస్తూ చేనేత కార్మికుల వృత్తిని కొల్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది చేనేత కార్మికులకు జీవనోపాధి లేకుండా చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చేనేతను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని, చేనేతలకు సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నారు.
చేనేతపై జీఎస్టీని తొలగించాలని కోరారు. కార్యక్రమంలో జనగామ పట్టణంలోని వీవర్స్‌కాలనీ, బాణాపురం, బచ్చన్నపేట, ఎల్లంల, సిరిపురం, సిద్దంకి, లింగాలగణపురం, నవాబుపేట గ్రామాల నుంచి పెద్దఎత్తున చేనేత కార్మికులతో పాటు భారతి సొసైటీ అధ్యక్షుడు గుర్రం నాగరాజు, చేనేత నాయకులు మచ్చ బాల నర్సయ్య, ఎనగందుల కృష్ణ, బొంతపల్లి నాగరాజు, అంకం తిరుమలేశ్, కోడం శ్రీనివాస్, నరేశ్, ఏల శ్రీనివాస్, ఇస్తారి, నగేష్ పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం సంఘీభావం తెలిపారు.