నెక్కొండ/కురవి, జూలై 28 : ఆయిల్‌పామ్ తోటల సాగు ఏటా విస్తరిస్తున్నది. వరికి ప్రత్నామ్నాయంగా దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చిపెట్టే పామాయిల్‌ను గత కేసీఆర్ సర్కారు అందుబాటులోకి తెచ్చింది. సబ్సిడీతో పాటు 30 ఏళ్ల పాటు రాబడి వస్తుందని, ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం వస్తుందని ఉద్యానవనశాఖ అధికారులు అవగాహన కల్పించడంతో దీన్ని సాగు చేసేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మూడు, నాలుగేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో సాగు విస్తరిస్తున్న క్రమంలో ఇక్కడే ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నెలకొల్పితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. వరంగల్ జిల్లాలో ఈ యేడు రెం డింతల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా, మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే 8,024 ఎకరాల్లో సాగవుతున్నది.
ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉద్యానవన శాఖ కృషి చేస్తున్నది. 2021లో కేసీఆర్ నేతృత్వంలో ఆయిల్‌పామ్ సాగుకు రైతులకు భారీగా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించడంతో రాష్టంలో దీని సాగుకు అంకురార్పణ జరిగింది. వరంగల్ జిల్లాలో 5,600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతున్నది.
మహబూబాబాద్ జిల్లాలో 8024 ఎకరాల్లో సాగు చేస్తుండగా, 322 ఎకరాల్లో దిగుబడులు వస్తున్నాయి. ఒక్క కురవి మండలంలోనే 322మంది రైతులు 1,478 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఐదేళ్ల వరకు ఏటా పంట పెట్టుబడికి ఏటా రూ.40 నుంచి 50 వేల వరకు ఉంటుండగా, ఐదేళ్ల నుంచి రైతుకు స్థిరమైన ఆదాయం రూ.1.80 లక్షల వరకు రానుందని, ఖర్చులు పోను ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. అంతర పంటలుగా కోకో, వక, జాజికాయ, మిరియాలు సాగు చేస్తూ ఎకరానికి రూ.50వేల అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను ఇస్తున్నాయి. ప్లాంటేషన్ ఖర్చు(ట్రెంచ్ కటింగ్, మొక్కలు నాటడం, సాగు నిర్వహణ)పై రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 60 శాతం అందిస్తున్నది. ఒక్కో మొక్క మార్కెట్లో రూ. 193 ఉంటే సబ్సిడీగా ప్రభుత్వం రూ.173 ఇస్తుండగా రూ.20లకే ఒక మొక్క రైతుకు లభిస్తున్నది. మొదటి సంవత్సంలో రూ.26వేల వరకు వివిధ రూపాల్లో ఇస్తుండగా, ఆ తర్వాత అంతర పంటల సాగుకు ఏటా రూ.4200లను సబ్సిడీగా అందిస్తున్నది. డ్రిప్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ అందిస్తున్నారు.
ఉద్యానవన పంటల సాగు రైతులకు లాభదాయకం. సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి. ఆయిల్‌పామ్ సాగుకు చౌడు నేలలు మినహా అన్ని నేలల్లోను సాగు చేయవచ్చు. కోతులు, తుఫాన్లు, చీడపురుగుల బెడద ఉండదు. మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చాం. రైతులు ఆయిల్‌పామ్‌పై దృష్టిసారించాలి.
– తరుణ్, డివిజన్ ఉద్యానవన శాఖాధికారి, నెక్కొండ