హనుమకొండ, సెప్టెంబర్ 16 : ఉత్తమ రాజకీయ నాయకత్వానికి, మంచి పౌరునిగా రాణించడానికి, భావిజాతి నిర్మాణానికి రాజనీతి శాస్త్రం తోడ్పడుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కాలేజీ రాజనీతిశాస్త్ర విభాగాధిపతి కవిత కన్వీనర్‌గా కాలేజీలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల రాజనీతిశాస్త్ర అధ్యాపకులకు నిర్వహిస్తున్న ఒకరోజు వర్క్‌షాప్‌కు రిజిస్టార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఇటీవల డిగ్రీ స్థాయిలో రాజనీతిశాస్త్ర సిలబస్‌లో నూతన అంశాలను చేర్చడం వలన రాజనీతిశాస్త్రం బలోపేతం మాత్రమే కాకుండా సమకాలీన సమస్యలకు పరిష్కారాలను చూపుతోందని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో హాజరైన అధ్యాపకులకు పలు సూచనలు చేస్తూ బోధన ఆసక్తికరంగా ఉండడానికి సమకాలీన అంశాలను, సామాజిక సమస్యలను, నైతిక విలువలను జోడించడం తప్పనిసరని చెప్పారు. రాజనీతిశాస్త్ర నూతన సిలబస్‌లో చేర్చిన నూతన అంశాలపై నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌కు కేయూ పరిధిలోని 100 మంది అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ డాక్టర్ జి.కృష్ణయ్య, కేయూ రాజనీతిశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వెంకటయ్య, సైబర్ క్రైమ్ సెక్యూరిటీ అనే అంశంపై డాక్టర్ ఎస్ కమలాకర్, సెమిస్టర్ పాలిటిక్స్‌పై డాక్టర్ ఎం.మధుసూదన్‌రెడ్డి, కమ్యూనిస్టు పాలిటిక్స్‌పై డాక్టర్ శామ్యూల్ ప్రవీణ్, రిసోర్స్‌పర్సన్‌గా వ్యవహరించి అధ్యాపకులకు పూర్తి అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ములుగు ప్రిన్సిపాల్ డాక్టర్ కే మల్లేశం, పరకాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి సంతోష్‌కుమార్, కాలేజీ రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్ కే.శ్రీదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ కే.రజనీలత, అధ్యాపకులు పాల్గొన్నారు.