భీమదేవరపల్లి, జూలై 27: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం అంగరంగ వైభవం గా జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రముఖ కవి అందెశ్రీ, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ, ముల్కనూరు గ్రంథాలయ ఫౌండర్ వేముల శ్రీనివాసులు, నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఇన్చార్జి ఎస్జీవీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ప్రతి ఏడు మాదిరిగానే ఈసారి కూడా వందలాదిమంది కవులు, రచయితలు, పాఠకులు పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా సాహిత్యాభివృద్ధి కోసం చేపట్టిన కథల పోటీల ప్రయత్నానికి రచయితలు జేజేలు పలికారు. అందెశ్రీ మాట్లాడుతూ మానవత్వం ఉన్న మనుషులు మాయమైపోతున్న తరుణం లో ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ద్వారా సాహిత్యాన్ని బతికిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. దీనికి నమస్తే తెలంగాణ దినపత్రిక రథచక్రం గా పనిచేయడం అభినందనీయమ న్నారు. ఈ సందర్భంగా ముల్కనూరు సాహితీపీఠం ఏర్పాటు చేసిన బంజారా మహిళల నృత్యా లు, ఘటం బోనంతో చేసిన ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది.
ప్రజా గ్రంథాలయానికి కవులు, ఆహుతులు విరాళాలు అందజేశారు. విద్యార్థులు, కళాకారులు వేదికపై ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. జయజయహే తెలంగాణ గేయాన్ని తెలంగాణతోపాటు ఆంధ్రా కవులు సైతం ఆలపించారు. కార్యక్రమంలో కోడూరి రాజ య్య స్మారకార్థం వారి కుటుంబ సభ్యు లు విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశా రు. కాగా, ఈ ఏడాది పోటీల్లో 470 మంది కవితలు పంపగా, వాటిలో 71 కవితలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు.
మొదటి బహుమతి రూ. 50 వేలు, ద్వితీయ బహుమతులు ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.25వేలు, తృతీయ బహమతులు(5) రూ. 10 వేలు అలాగే 13 మందికి రూ.5వేలు, 20మందికి రూ. 3వేలు, 30మందికి రూ.2వేలు చొప్పున అందించారు. నమస్తే తెలంగాణ కరీంనగర్ బ్రాంచి మేనేజర్ కనపర్తి ప్రకాశ్‌రావు, ముల్కనూరు సాహితీ పీఠం అధ్యక్షుడు వంగ రవి, కార్యవర్గ సభ్యులు పల్లా ప్రమో ద్ రెడ్డి, గొల్లపల్లి లక్ష్మయ్య, అయిత శ్రీనివాస్, మూల శ్రీనివాస్, తిరుపతి, సుగుణాకర్, ఎం కొంరయ్య, శంకర్రావు, మాజీ ఎంపీపీ సరోజన పాల్గొన్నారు.