జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీలో రోజురోజుకూ పైరవీలు పెరిగిపోతున్నాయి. ఉన్నతస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి వస్తు న్న సిఫార్సులతో అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలోనే ఒక కాంట్రాక్టర్‌కు వచ్చిన సెక్యూరిటీ టెండర్ 4 నెలలు దాటినా రిక్రూట్మెంట్కు నోచుకోలేదు. ని బంధనల ప్రకారం టెండర్ అగ్రిమెంట్ జరిగిన నెల రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. కానీ, 4 నెలలు దాటినా ఇంతవర కు జరుగకపోగా, ఆ కాం ట్రాక్టర్‌పై అధికారుల నుంచి ఎలాంటి చర్య లు కనిపించడం లేదు.
ఇదే విషయమై ‘నమస్తే తెలంగాణ’లో మే 14న ‘కొలువుల దందాకు కోటికి స్కెచ్’ అనే కథనం ప్రచురితమైంది. దీంతో నియామక ప్రక్రి య వాయిదా వేసిన అధికారులు ఇప్పటికీ పూర్తి చేయలేదు. రాజకీయ ఒత్తిళ్లే ఇందుకు కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు 4 నెలలుగా రిక్రూట్మెంట్ వాయిదా వేస్తున్నారని, భూ నిర్వాసితులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల వ్యక్తులను పైరవీలతో నియామకానికి సిద్ధం చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి.
సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థలో ఆస్తుల పరిరక్షణ కోసం యాజమాన్యం పర్మినెంట్ సెక్యూరిటీ గార్డులతోపాటు ప్రైవేటు సెక్యూరిటీ సేవలను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వినియోగించుకుంటున్నది. అయితే, ఇప్పటి వరకు సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగుల వరకే పరిమితమైన పొలిటికల్ రాజకీయం ఇప్పుడు ఔట్ సోర్సింగ్ కార్మికుల వరకు చేరింది. ఈ వ్యవస్థ గతంలోనూ అంతంతమాత్రంగా ఉండగా ప్రస్తుతం పరిధి దాటి విస్తరించింది. సింగరేణిలో ప్రైవేట్ సెక్యూరిటీ (ఔట్ సోర్సింగ్) ఉద్యోగాల కోసం ఏకంగా మంత్రుల నుంచే పైరవీలు రావడం భూపాలపల్లిలో హాట్‌టాఫిక్‌గా మారింది.
టెండర్ ఖరారైన వ్యక్తి నెల రోజుల్లోపు మ్యాన్‌పవర్‌ను అందించాలి. కానీ, 4 నెలలైనా మ్యాన్‌పవర్ ఇవ్వకపోవడంపై తెర వెనక రాజకీయం బహిర్గతమవుతున్నది. నెల రోజుల్లోగా సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టకపోతే టెండర్ రద్దు చేయాలనే నిబంధన ఇక్కడ అమలు జరుగడం లేదని, అధికార పార్టీ నాయకులు తమ వ్యక్తులను నియమించాలనే ఒత్తిడితో కాలయాపన జరుగుతున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రైవేటు జాబ్స్‌కు కూడా దళారులు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 27 మంది నియామకానికి ఓ వ్యక్తికి టెండర్ రాగా మొత్తం 40 మందిని తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ దందాలో మొత్తం రూ.కోటికి స్కెచ్ వేసినట్లు తెలుస్తున్నది.
సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగానికి డిమాండ్ పెరుగుతున్నది. ఒక్కో పోస్టుకు రూ.2లక్షలకు పైగానే వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. దళారుల రంగ ప్రవేశం, ఒక కార్మిక సంఘం నేత అండదండలతో ఈ తతంగం యథేచ్ఛగా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి ఏరియాలో ప్రైవేటు సెక్యూరిటీ కింద సుమారు 116 మంది పని చేస్తున్నారు. కాగా, తాజాగా(నాలుగు నెలల క్రితం) మరో కాంట్రాక్టర్‌కు 27మంది రిక్రూట్మెంట్కు టెండర్ వచ్చింది. అప్పటి నుంచి అసలు రాజకీయం మొదలైంది. టెండర్ పొందిన వ్యక్తి మ్యాన్ పవర్ పెట్టుకోవాల్సి ఉండగా పొలిటికల్, పలువురు అధికారులు తమకు సంబంధించిన వారిని నియమించాలని ఒత్తిళ్లు వస్తుండడంతో ఆ కాంట్రాక్టర్ జాప్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. 4 నెలలు దాటినా నియామక ప్రక్రియ పూర్తి చేయని కాంట్రాక్టర్‌ను టెర్మినేట్ చేయకపోవడం బహిరంగంగా వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతున్నది.
ప్రైవేటు సెక్యూరిటీ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రావడం లేదు. అతడికి షోకాజ్ నోటీసులు ఇచ్చాం. మరో లెటర్ ఇస్తాం. తర్వాత నోట్ మూవ్ చేసి కార్పొరేట్ నుంచి అప్రూవల్ తీసుకొని చర్యలు తీసుకుంటాం. పొలిటికల్ ప్రెసర్స్ ఏమీ లేవు. ఉంటే అతడిపై ఉండొచ్చు. మాకు సంబంధం లేదు.
– ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, భూపాలపల్లి సింగరేణి జీఎం