హనుమకొండ, మే 7: ‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కాని కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెండో సీఎంగా ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ అక్రమాలకు పాల్పడుతూ రాహుల్‌గాంధీకి ఏటీఎంగా మారాడని ఆరోపించారు. తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు కేసీఆర్ అని, రైతు బంధులాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులు, వ్యవసాయం మీద సీఎం ఒక్క సమీక్ష చేయలేదన్నారు. క్యాబినెట్ మంత్రులు వచ్చి దేవాదుల పంపు హౌజ్‌ను ప్రారంభించలేక పోయారన్నారు.
పేదల ఇండ్లు కూలుస్తున్నారే తప్ప ప్రాజెక్టులు కట్టడం లేదన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆక్రోశంతో ఉన్నారని, పండిన పంటల కొనకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా దిగజా రి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిజాలు మాట్లాడితే ఉలికిపాటెందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన అట్టర్ ఫ్లాప్ అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన అన్ని డిక్లరేషన్లపై మాట్లాడతామని, పోరాడుతామని రాజయ్య తెలిపారు.
సమావేశంలో కుడా మాజీ చైర్మెన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉడతల సారంగపాణి, చింతల యాదగిరి, జక్కుల శ్రీనివాస్ యాద వ్, నాయకులు పులి రజినీకాంత్, జనార్దన్‌గౌడ్, రామ్మూర్తి, నార్లగిరి రమేశ్, నయీముద్దీన్, పానుగంటి శ్రీధర్, బండి రజినీకుమార్, రవీందర్రావు, రాకేశ్‌యాదవ్, మూటిక రాజు, పసుపులేటి విష్ణువర్ధన్‌రెడ్డి, వీపీ రెడ్డి, పున్నంచందర్ పాల్గొన్నారు.
ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నరు..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కతుంది. రైతు సంగ్రామ సదస్సుకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ దందా చేస్తోంది. ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఉలికిపడుతున్నారు. ఇచ్చిన హామీల అమలెప్పుడు అని కేటీఆర్ అడిగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. పాలన తెలియదా? మేమేమైనా హౌలాగాళ్లమా? అని నాడు రేవంత్‌రెడ్డి అనలేదా? ఎకు వ తకువ మాట్లాడితే మీ నాలుకలు చీరేస్తాం. మీకు అసలు వ్యవసాయం గురించి తెలుసా? ఏ రోజైనా వ్యవసాయం చేశారా? రైతు జీవితాలకు భరోసా ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.
ఎమ్మెల్యే నాగరాజు పంటలు కొంటున్నామంటున్నడు. కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవం కాదా? కల్లాల వద్దకు పోదామా? ఇంకా పోలీసు అనుకుంటున్నావా? మా నాయకుడికి థర్డ్ డిగ్రీ ఇస్తా అంటావా? బిడ్డా జాగ్రత్త నాలుక చీరేస్తాం. నాయిని రాజేందర్‌రెడ్డి ఎందుకు ప్రతిపక్షమంటే ఉలికిపడుతున్నడు. మంత్రిగా కేటీఆర్ తన శాఖల ద్వారా ఎంత అభివృద్ధి చేశారో తెలియని అజ్ఞానులు మీరు. కాంగ్రెస్ చిల్లర మాటలకు భయపడతామా? కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు.
రైతుల తరపున మాట్లాడిన కేటీఆర్‌పై కేసులు పెడతారా? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అవసరం లేదు. మీకు మేము చా లు. తెలంగాణ ప్రజల తరపున అన్ని వర్గాల కో సం పోరాడుతున్నాం. పెద్ద సభ పెట్టి ఎకరానికి రైతు భరోసా వేసిండు రేవంత్ రెడ్డి. కానీ కేసీఆర్ రైతులు అడగకుండానే రైతు బంధు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను మీరు తిట్టొచ్చు. మీరు మాట్లాడిన భాషలోనే ఇచ్చిన హామీలడిగితే బూతులు తిడతారా? రేవంత్ పాలన పోవాలి.. రైతు బంధు కేసీఆర్ పాలన రావాలని రైతులు కోరుకుంటున్నారు.
– అరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్యే