ఖిలావరంగల్, జూన్ 24: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ సెల్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినతిపత్రాలు సమర్పించారు. కూర్చోవడానికి వసతులు లేకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తం 124 దరఖాస్తులు రాగా, అందులో భూ సంబంధిత సమస్యలకు సంబంధించినవి 84 ఉన్నాయి. వరంగల్ ఇన్నర్ రింగ్‌రోడ్డు బాధితులు వంద మంది తమకు నష్టపరిహారం చెల్లించకుండానే రోడ్డును వేస్తున్నారని, నాలుగేళ్లుగా పరిహారం చెల్లిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని ఖిలావరంగల్‌కు చెందిన భూ నిర్వాసితులు పాలకుర్తి సత్యం, సూర్య, వెంకటరమణ, బిల్లా శంకర్, బజ్జూరి సుశీల, విజయ, రాజమణి, తహారాబేగం, నసీం సుల్తానా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. నాగ్‌పూర్ నుంచి వరంగల్ మీదుగా విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. జక్కలొద్దికి చెందిన మహిళ తనకున్న 8 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదు చేసింది. ఎస్సీ కార్పొరేషన్లో రుణం మంజూరైనా మూడేళ్లుగా డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నారని రెండు కాళ్లు సరిగా పనిచేయని ఎర్ర యాకయ్య ఫిర్యా దు చేశాడు.
మైనారిటీ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నయీమోద్దీన్ ఫిర్యాదు చేశాడు. చెరువు శిఖం భూమిని కబ్జా చేసి రోడ్డు నిర్మిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నర్సంపేట మండలం గురిజాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు సున్నపు భిక్షపతి ఆధ్వర్యంలో మత్స్యకార్మికులు వినతిపత్రం ఇచ్చారు. 290 ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువులో చేస్తున్న వెంచర్ పనులను నిలిపివేయాలని తెలిపారు. చెరువుపై 350 కుటుంబాలు ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లను చేయాలని ఏబీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు బొట్ల నరేశ్, గుర్రం అజయ్, పార్థసారథి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సత్యశారాదాదేవి మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను మానవతా దృక్ఫథంతో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ జీ సంధ్యా రాణి, డీఆర్డీవో కౌసల్యాదేవి, ఆర్డీవో కృష్ణవేణి, జడ్పీ సీఈవో రాంరెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట : సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి అన్నారు. సోమవారం నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. వార్డులను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీలో నిల్వ ఉన్న మందులపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండి బెడ్స్ తక్కువ ఉన్న విషయాన్ని తెలుసుకున్నారు. అత్యవసరంగా వచ్చిన రోగులను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేసి పంపించాలని కోరారు. ప్రసవాలకు వచ్చే మహిళలకు తగినవిధంగా వైద్యం చేయాలని సూచించారు. సాధారణ ప్రసవాలను ప్రొత్సహించాలని తెలిపారు. నర్సంపేటలోని డయాలసిస్ సెంటర్లో జిల్లాలోని రోగులందరూ వచ్చేలా చూడాలని సూచించారు. డయాలసిస్ విభాగంలో డయాలసిస్ రోగుల వివరాల రికార్డులను పరిశీలించారు. గైనిక్, పీడియాట్రిక్, డయాలసిస్, జనరల్ వార్డుల్లో తిరుగుతూ చికిత్సలు అందుతున్న తీరును రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీ గోపాల్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కిషన్‌నాయక్ పాల్గొన్నారు.
నర్సంపేట : నర్సంపేట పట్టణం మాధన్నపేట రోడ్డు రెండో వీధిలో రోడ్డు ఆక్రమించి ప్రహరీ, మెట్లు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పొదిల రాంచందర్, మరికొందరు సోమవారం వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఏకాంబ్రం అనే వ్యక్తి తూర్పు వైపు రోడ్డు ఆక్రమించి మెట్లు, ప్రహరీ నిర్మించాడని, అడిగితే తనకు పర్మిషన్ ఉందని చెబుతున్నాడని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. రాజు, సావిత్ర, వసంత, రాజు, భాగ్యమ్మ, శ్యామ్, రజిత, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, నర్సయ్య, కిరణ్, సత్యం, మల్లికార్జున్, సదమ్మ ఉన్నారు.