పాలకుర్తి రూరల్, అక్టోబర్ 19 : పాలకుర్తి మండలం కొండాపురం శివారు మేకలతండాకు చెందిన లకావత్ శ్రీను(22) మృతితో ఒక్కసారిగా పాలకుర్తిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బంధువులు, తండావాసులతోపాటు గిరిజన ప్రజాసంఘాలు, సీపీఎం, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు 5 గంటలపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మేకల తండవాసులు, బంధువుల పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
శ్రీను మృతికి కారణమైన ఎస్సై, సీఐని సస్పెండ్ చేయడంతోపాటు పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఎస్సై సాయి ప్రసన్నకుమార్‌తో శ్రీనును కొట్టించిన పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావుపై కేసులు నమోదు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల సాంబయ్య, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు బానోత్ మహేందర్, ధరావత్ రాజేశ్‌నాయక్, లకావత్ నాగరాజు, వెంకట్ డిమాండ్ చేశారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తొపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యంలో కమిషనరేట్ ఏసీపీలు, సీఐలు, ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్ ఎదుటే కాలబెడతామని బంధువులు కట్టెలు తెచ్చి నిప్పంటించారు. జనగామ డీసీపీ కలెక్టర్ షేక్‌రిజ్వాన్ బాషాతో ఫోన్లో ప్రజా, గిరిజన సంఘాల నాయకులతో మాట్లాడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందేలా కృషి చేస్తానని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
సంబంధిత అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్‌తోపాటు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. శ్రీను మృతికి కారణమైన ఆరుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఘటనకు బాధ్యులైన సంబంధిత అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన కారులు ధర్నా విరమించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేశ్, రాపర్తి సోమయ్య, చిట్యాల సోమన్న ఘటనకు బాధ్యులైన ఎస్సై, సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
శ్రీను మృతికి కారణమైన కాంగ్రెస్ నాయకుడిపై కేసు పెట్టకుండా కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారని కుటుంబసభ్యులు, బంధువులు ప్రజా, గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శ్రీను మృతికి కారణమైన కాంగ్రెస్ నాయకుడు, పాలకుర్తి మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, హుస్సేన్‌పై కేసు నమోదు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి సాంబయ్య, గిరిజన సంఘాల నాయకుడు మహేందర్‌నాయక్ డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
శ్రీను అంత్యక్రియలు స్వగ్రామమైన మేకలతండాలో శనివారం రాత్రి ముగిశాయి. శ్రీను మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం దవాఖాన నుంచి వయా వర్ధన్నపేట, జఫర్‌గఢ్ మీదుగా బమ్మెర పెద్దతండా బీ నుంచి మేకల తండాకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో పెద్దతండా బీ వద్ద మేకల తండావాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ గిరిజన సంఘాల నాయకులు, తండావాసులతో మాట్లాడి రాజీ కుదిర్చి, శ్రీను కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీంతో తండావాసులు శ్రీను మృతదేహాన్ని మేకలతండాకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు.
లకావత్ శ్రీను సోదరుడు సోమన్న ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. టీఎస్కేతండాకు చెందిన గుగులోత్ హుస్సేన్, గుగులోత్ విజయ, నర్సింగపురం తండాకు చెందిన మాలోత్ వినోద్, భూక్యా మహేశ్, మాలోత్ మంగ్తి, నూనావత్ గణేశ్‌పై కేసు నమోదు చేశామన్నారు.