ములుగు, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించి వేలాది ఎకరాలకు నీళ్లందించారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప సరస్సును జలాశయంగా మార్చి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి సాగునీరందించేందుకు రూ.561 కోట్లతో రామప్ప-పాకాల, రామప్ప-రంగాయ చెరువు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ములుగు జిల్లా ములుగు మండలంలోని 35 చెరువులు, కుంటల్లోకి గోదావరి జలాలు తరలించేందుకు రూ.143 కోట్లతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనున్నారు.
భూ సేకరణ అవసరం లేకుండా పాకాల ఎత్తిపోతల పైప్‌లైన్ ద్వారానే ఈ ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కానున్నది. కన్నాయిగూడెం మండలం దేవాదుల పంప్‌హౌస్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భీమ్ఘనపురం రిజర్వాయర్‌కు చేరే నీటిని రామప్ప సరస్సులోకి తరలిస్తున్నారు. ములుగు శివారు రంగారావుపల్లిలో నిర్మించిన పంపుహౌస్ ద్వారా వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సుకు, నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువుకు దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషితో గోదావరి జలాలను గత కొన్నేళ్లుగా తరలిస్తున్నారు.
ములుగు నియోజకవర్గం నుంచి గోదావరి జలాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నప్పటికీ ములుగు మండలంలోని చెరువులు, కుంటలకు సాగు నీరందడం లేదని రైతులు గతంలోనే ప్రభుత్వం దృష్టికి తేగా గత నాలుగు సీజన్లలో పైప్‌లైన్ వెంట ఉన్న గేటు వాల్వ్‌లు ఓపెన్ చేసి పలు చెరువులను నింపారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో గోదావరి జలాలతో ములుగు మండలంలోని చెరువులు, కుంటలను నింపాలని రైతులు డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం గత జనవరిలో మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొట్లాపూర్ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి నిధులు విడుదల చేసింది. ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది.
భూ సేకరణ అవసరం లేకుండానే పొట్లాపూర్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనున్నారు. రామప్ప చెరువు నుంచి పాకాల, రంగాయ చెరువుకు ఉన్న రెండు పైప్లైన్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ సేకరణ జరిగింది. పొట్లాపూర్ ప్రాజెక్టుకు సంబంధించిన పైప్లైన్లను కూడా ఈ భూముల నుంచే వేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా ములుగు మండలంలోని 7,555 ఎకరాలకు సాగు నీరందించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప జలాశయం వద్ద ఉన్న పంపు హౌస్ నుంచి మోటర్ల ద్వారా నిర్దేశించిన చెరువులకు నీటిని తరలించనున్నారు.
రామప్ప నుంచి జంగాలపల్లి చెరువు వరకు 3.4 కిలో మీటర్ల పైప్‌లైన్, రామప్ప నుంచి లోకం చెరువుతో పాటు కోమటి చెరువు వరకు 8.7 కి.మీ., పత్తిపల్లి, పొట్లాపూర్ గ్రామాల్లో ఉన్న చెరువులకు 11.7 కిలోమీటర్ల మేర వేర్వేరుగా మూడు పైప్లైన్లు నిర్మించనున్నారు. రామప్ప పంప్‌హౌస్ వద్ద మరో మూడు మోటర్లు ఏర్పాటు చేసి ఎత్తిపోతల ద్వారా 700 ఎంసీఎఫ్‌టీల నీటిని తరలించాలని నిర్దేశించారు. మొత్తానికి అప్పటి సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్యవహరించి చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల స్ఫూర్తితో నేడు ములుగు మండలంలోని రైతులకు సాగు నీరందే పొట్లాపూర్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.