సుబేదారి, జూన్ 10: కేయూసీ ఇన్స్పెక్టర్ పత్తిపాక దయాకర్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు. భూ బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వస్తే కేసులు నమోదు చేయకుండా తిప్పించుకోవడం, ఎదుటివారితో చేతులు కలిపి, భూ సెటిల్మెంట్స్ చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్ పరిధిలోని భీమారం, గోపాలపురం, పలివేల్పులకు చెందిన పలువురు కేయూసీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆయన చట్టపరంగా బాధితులకు న్యాయం చేయకపోగా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి సెటిల్మెంట్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఆయన వివాదాస్పదుడని పేరుంది. కేయూసీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ, సీఐ హోదాలో రెండోసారి సస్పెండ్ కావడం చర్చనీయాశంగా మారింది.
5వ పోలీసు బెటాలియన్‌లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహిళ తండ్రి రిటైర్ట్ టీచర్, ఉద్యోగం నుంచి విరమరణ పొందగా వచ్చిన బెన్ఫిట్స్ డబ్బులతో, కేయూసీ పోలీసు స్టేషన్ పరిధి భీమారంలో ప్లాట్ కొనుగోలు చేశాడు. ఈ భూమిని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ ఫిర్యాదు స్వీకరించకుండా భూ ఆక్రమదారులతో చేతులు కలిసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని, బాధితుడిని సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించడంతో, అతడు ఇటీవల పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఇదంతా నిజమని తేలడంతో దయాకర్‌పై సస్పెండ్ వేటుపడింది. కాగా, దయాకర్ ఎక్కడ పనిచేసినా సస్పెండ్ కావడం ఆయన పనితీరుకు అద్దం పడుతున్నది. ఎస్సైగా ఉద్యోగంలో చేరిన మొదట్లోనే చిట్యాల పోలీసు స్టేషన్లో పనిచేసి ఓ కేసు విషయంలో బదిలీ వేటు పడింది.అలాగే హసన్‌పర్తి పోలీసు స్టేషన్లో పనిచేసినప్పుడు ఇదే తీరు. సీఐగా పదోన్నతి పొందిన తర్వాత వరంగల్ రైల్వేలో పనిచేసిన సమయంలో హనుమకొండ హంటర్‌రోడ్డులోని బార్‌లోని మద్యం సేవిస్తూ, అక్కడ మాజీ కార్పొరేటర్‌పై చేయిచేసుకున్నాడు.
ఇంతకుముందు పనిచేసిన హనుమకొండ పోలీసు స్టేషన్లో దయాకర్ ఇదే తీరుగా వ్యవహరించగా సస్పెండ్ అయ్యాడు. నయీంనగర్‌లో 300 గజాల ఇంటి ప్లాట్ విషయంలో ఓ కార్పొరేటర్‌కు, భూబాధితుడు రవీందర్‌రెడ్డికి వివాదం జరిగింది. ఈ గొడవలో భాదితుడు రవీందర్‌రెడ్డి 2020 సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేయగా, హనుమకొండ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దయాకర్ పోలీసుస్టేషన్లోనే బాధితుడి ఎదుటి వారితో కలిసి చితకబాధాడు. అప్పటి సీపీకి బాధితుడు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టి ఆదే స్టేషన్లో ఇన్స్పెక్టర్ దయాకర్‌పై 2020 అక్టోబర్ 1వ తేదీన కేసు నమోదు కావడం, సస్పెండ్ అయ్యాడు. ఈకేసులో సోదా కిరణ్తోపాటుగా అతడి డ్రైవర్, ఏ5గా సీఐ ఇన్స్పెక్టర్ దయాకర్‌పై కేసు నమోదైంది. సస్పెన్షన్ ఎత్తివేత తర్వాత పలుకుబడితో కేయూ పోలీసు స్టేషన్‌కు వచ్చిన తర్వాత మళ్లీ ఇక్కడ కూడా భూ వివాదం కేసులో దయాకర్ సస్పెండ్ అయ్యాడు.