హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 4: నయీంనగర్ పెద్దమోరీ కూల్చివేత పనులు జరుగనున్నందున శుక్రవారం నుంచి ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా తెలిపారు. రూ.8.5 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తుండడంతో 3 నెలలపాటు నయీంనగర్ రోడ్డుపై రాకపోకలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని సీపీ నగర ప్రజలను కోరారు. కరీంనగర్ నుంచి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపునకు వెళ్లాల్సిన భారీ వాహనాలు కేయూసీ జంక్షన్ నుంచి పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ఆటోనగర్ మీదుగా వెళ్లాలి. కరీంనగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కేయూసీ జంక్షన్ నుంచి పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు, అమృత జంక్షన్, హనుమకొండ చౌరస్తా మీదుగా బస్టాండ్ చేరుకోవాలి.
ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు ఉర్సుగుట్ట, కడిపికొండ, మడికొండ, ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలి. వరంగల్, నర్సంపేట వైపు నుంచి కరీంనగర్ వైపునకు వెళ్లాల్సిన భారీ వాహనాలు ఎంజీఎం, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి. హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు హనుమకొండ చౌరస్తా, అమృత, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి.