సుబేదారి, ఏప్రిల్ 2: ఇద్దరు నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్కు చెందిన దాసరి శ్రీకాంత్, వరంగల్ కరీమాబాద్‌కు చెందిన బాలిని మహేశ్ కలిసి భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీ చర్ల-శబరి ఏరియా కమిటీ కమాండర్ దేవన్న పేరుతో నకిలీ లెటర్‌ప్యాడ్ సృష్టించారు.
అనంతరం హనుమకొండలోని అజర, దీపక్ స్కిన్ క్లినిక్ హాస్పిటల్, ఎన్ఎస్ఆర్ గ్రూప్ సంస్థ యాజమాన్యాలకు రోగుల నుంచి అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారని లేఖలు పంపించి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. లేకుంటే ఈడీ, సీబీఐకి పట్టిస్తామని, నక్సల్స్ చేతిలో చచ్చిపోతారని హెచ్చరించారు. ఆయా యాజమాన్యాల ఫిర్యాదుతో విచారించిన పోలీసులు బెదిరింపులకు పాల్పడింది శ్రీకాంత్, మహేశ్ అని నిర్ధారించి అరెస్టు చేశారు. నకిలీ లెటర్ ప్యాడ్, బైక్, రెండు ఫోన్ల స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.